Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన 36 మంది లబ్ధిదారులను రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అధికారుల సమక్షంలో మంగళవారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడారు. పేదల కలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని తెలిపారు. త్వరలోనే పేదల సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునే వెసలుబాటును ప్రభుత్వం కల్పించనుందని చెప్పారు. వెల్లంపల్లి గ్రామంలో ఇప్పటికే 36 ఇండ్లు పూర్తయ్యాయని, ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈనెల 21న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా గృహప్రవేశ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనుల్లో ఇండ్లు కోల్పోయిన వారికి సంగెం మండలంలోని రాంచంద్రాపురం, ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్ గ్రామాల్లో ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 25న నడికూడ మండలంలోని చర్లపల్లిలోనూ ఇండ్లను ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, ఏసీపీ శివరామయ్య, తహశీల్దార్ జగన్మోహన్, పీఆర్ డీఈ లింగారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ బండి సారంగపాణి, వెల్లంపల్లి సర్పంచ్ వెలగందుల కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.