Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని సినీ దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని మేరుభవన్లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికరణను మానుకోవాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు ఏడు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన, ఆందోళనలు చేపడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ అణిచివేసేందుకు పూనుకుందన్నారు. ఈ పోరాటంలో 600 మంది రైతులు అమరులయ్యారని తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో కూడా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ, విద్యుత్ బిల్లును విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రైతులకు వెన్నుదన్నుగా పోరాటాలను మరింత బలోపేతం చేయడానికి ఊతమిచ్చేలా ఈనెల 30 న రైతన్న సినిమా విడుదలవుతుందని చెప్పారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతులు ఎదుర్కొనే కష్టాలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితిలు ప్రతిబింబించేలా ఈ సినిమా చిత్రీకరణ చేశామని వివరించారు. అందరూ రైతన్న సినిమా చూసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు భూక్య సమ్మయ్య, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వేముల సాంబయ్య, సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, అనంతగిరి రవి, పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ , సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు లావుడ్యా రాజు, ఎలకంటి రాజేందర్, డివిజన్ కార్యదర్శి పరికి రత్నం,అడ్డురి రాజు, సీపీఐ జిల్లా నాయకులు గోవర్ధన చారి, ఐద్వా నాయకురాలు గుజ్జుల ఉమా, కవిత తదితరులు పాల్గొన్నారు.