Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
నవతెలంగాణ-ఎల్కతుర్తి
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీసీల అభివృద్ధిని గాలికోదిలేసి పట్టించుకోవడం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. గురువారం పెంచికలపేట శివారు సువర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీ ఉద్యమకారుడికి చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు తదితర జంతు సమూహాల లెక్కలు తీసే కేంద్రప్రభుత్వానికి బీసీ జనాభా గణనలో ఎదురౌతున్న అభ్యంతరం ఏమీటో అర్థం కావడం లేదన్నారు. ఏడేండ్ల పాలనలో ప్రధాని మోదీ బీసీల సంక్షేమం కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రారంభించకపోవడం విచాకరమన్నారు. బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా ప్రధాని పెడచెవిన పెట్టాడని, ఇది బీసీలను అవమానించడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చేపట్టబోయే జనాభా లెక్కలలో బీసీల గణన నిర్వహించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలపడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. 56శాతం జనాభా కలిగిన బీసీల అభివద్ధిని గాలికి వదిలేసిన బీజేపీ ప్రభుత్వం ప్రగతి నిరోధక పార్టీ గాక మరేమౌతుందని ఆయన ప్రశ్నించారు. దేశంలోని మెజారిటీ ప్రజలైన బీసీల వికాసాన్ని ఆకాంక్షింకుండా ''సబ్కా సాథ్.. సబ్ కా వికాస్' నినాదాల ప్రచారానికి కోట్లు వెచ్చించడం వలన ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ ఉద్యమానికి ఇక్కడి నుండే శ్రీకారం చుడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలోలో రాష్ట్రంలోని బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.