Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని కేంద్ర పర్యటక, సాంస్కతిక ఈశాన్య అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో గురువారం పర్యటించిన ఆయనకు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. తొలుత మంత్రి కిషన్‌రెడ్డి జిల్లా కేంద్ర శివారులోని గట్టమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు చేయించారు. అనంతరం మంత్రి గట్టమ్మ సమీపంలోని హరిత హోటల్‌ను ప్రారంభించారు. తదనంతరం వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలోని కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయాన్ని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ములుగు ఎమ్మెల్యే ధన్నసరి అనసూయలతో కలిసి మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలను కిషన్‌రెడ్డి పరిశీలించి పర్యాటక రంగ అభివద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై టూరిజం, పురావస్తు శాఖల అధికారులతో చర్చించారు. అలాగే ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించి మౌలిక సదుపాయాలను మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. రామప్ప ఆలయం కాకతీయుల శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనమన్నారు. రామప్ప ఆలయాన్ని, జిల్లాలోని ఇతర పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రధాని మోడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉటంకించారు. కోవిడ్ నిర్మూలనలో వైద్యులు, సిబ్బంది విశేష కృషి చేశారంటూ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే 12 ఏండ్ల వయస్కులైన బాలలందరికీ వ్యాక్సిన్ వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అలాగే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి టూరిజం శాఖ ద్వారా సబ్సిడీతో టూరిజం ప్రాంతాల్లో విమాన ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పర్యటక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ధన్నసరి అనసూయ మాట్లాడుతూ రామప్ప ఆలయ అభివృద్ధికి పాలకులు చొరవ చూపడం అభినందనీయమని తెలిపారు. ఆలయ పరిసరాల్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించే విషయమై కమిటీ వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.