Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యకాస జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య
నవతెలంగాణ-నర్సంపేట
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం వ్యకాస కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందే తప్పా ఆ దిశలో చర్యలు చేపట్టడం లేదన్నారు. జిల్లాల పునర్విభజన చేసి యేడేండ్లు గడిచినా ఇంత వరకు ప్రభుత్వం జిల్లాల వారిగా డీఎల్సీల సమావేశాలు నిర్వహించలేదన్నారు. తాజాగా కేసీఆర్ పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపడానికి పోడు రైతుల నుంచి ధరఖాస్తులు స్వీకరించి అర్హులందరికి హక్కు పత్రాలు ఇస్తామని చెప్పారన్నారు. అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా ఒక్క ములుగు జిల్లాలోనే సమావేశం నిర్వహించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోడు భూముల సమస్యపై నిరంతరం పోరాడుతున్న సంఘాల ప్రతినిధులను, సంస్థలను ఆహ్వానించకుండా నాలుగు జిల్లాల సమావేశాన్ని ములుగులో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా వచ్చి తమ సమస్యలను ఏవిధంగా చెప్పుకోగలుగుతారన్నారు. ఇప్పటికైనా జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించి పోడు రైతుల నుంచి ధరఖాస్తులను స్వీకరించాలని, పోడు సాగు రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. అటవీ హక్కుల చట్టం-2006కు భిన్నంగా కమిటీల ప్రమేయం లేకుండా పరిష్కారం ఏవిధంగా చూపుతారన్నారు. వరంగల్ జిల్లాలో 3,600మంది పోడుదారులు ఉన్నట్లు ఎఫ్ఆర్సీ, డీఎల్సీ కమిటీలు గతంలో ఆమోదించాయని, ఆ దిశలో పరిష్కారం చేసి హక్కు పత్రాలు జారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ భూముల రక్షణ కమిటీల పేరుతో గ్రామస్తుల నడుమ ఘర్షణలు సృష్టించే కమిటీలను వేయవద్దన్నారు. పోడు హక్కు దారులందరికి పట్టాలిచ్చే కమిటీలను మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. నలభై యేండ్లగా సాగు చేస్తున్న పోడు రైతులకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యను క్షుణంగా అర్థం చేసుకొని పరిష్కారం దిశలో చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మాదాసి యాకూబ్, మూడు సూక్య, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.