Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ- కోల్బెల్ట్
సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణి, కోల్ ఇండియాలకు కాకుండా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమని సీఐటీయూ నేతలు అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే వన్, కెేఎల్పీ గనుల్లో సింగరేణి కోల్మైన్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకంతో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి అడుగులు కదుపుతోందన్నారు. ఒకవైపు బొగ్గు కొరత ఉన్నదంటూనే బొగ్గు రంగంలో అపార అనుభవం కలిగిన కోల్ ఇండియా, సింగరేణిని పక్కన పెట్టి నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. యాజమాన్యం తన సొంత ఖర్చులతో కనుగొన్న 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి చూస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నాయకులు, అనుబంధ యూనియన్ నాయకులు హుజరాబాద్ ఉప ఎన్నికల వైపు చూస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలిపుతున్నారని విమర్శించారు. కేంద్రం కొత్త బ్లాకులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి డబ్బులు వాడుకుంటూ నష్టాల పాలు చేస్తున్నదని అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అన్ని యూనియన్లు ఐక్య పోరాటాలు చేయాలన్నారు. రాజకీయ జోక్యంతో ఇప్పటికే గత సంవత్సరం లాభాలు తగ్గించారని, ఈ సంవత్సరం లాభాలలో ఉన్నదని చెపుతూనే దీపావళి బోనస్ చెల్లించడం గురించి బ్యాంకుల చుట్టూ తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణిలో ఏం జరుగుతుందో కంపెనీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. యాజమాన్యం ఇచ్చిన కాలపరిమితి ముగిసిన అన్ని యూనియన్లను ఆహ్వానించి కార్మికుల సమస్యలపై చర్చించాలన్నార. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షుడు వంగాల రామస్వామి, పిట్ నాయకులు సురేష్, శ్రీనివాస్, ప్రకాష్, ఐలయ్య, అమర్, గని కార్మికులు పాల్గొన్నారు.