Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి
- డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
నవతెలంగాణ-సుబేదారి
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినందున ఉపాధ్యాయుల సర్దుబాటులోని లోపాలను సవరించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ లింగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ ఎక్సైజ్కాలనీలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులకు నూతన సర్వీసు నిబంధనలు రూపొందించి వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఎన్నో యేండ్లుగా ప్రమోషన్లు లేకపోవడంతో ఉపాధ్యాయులు నష్టపోతున్నారని వాపోయారు. పాఠశాలలో విద్యా వాలంటీర్లను వెంటనే నియమించాలని, మూతబడిన బడులను తెరిపించాలన్నారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం గంగాధర్ మాట్లాడారు. నూతన విద్యా విధానం 2020 కార్పొరేటీకరణ, కాషాయీకరణకు దోహదపడుతుందన్నారు. ఈ విధానాన్ని తిరస్కరించాలన్నారు. కామన్ స్కూల్ విద్యావిధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ అబ్దుల్ ఆలీమ్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో భౌతిక వసతులు కల్పించాలని, స్కేవెంజర్ లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టీ సుదర్శనం, అదనపు ప్రధాన కార్యదర్శులు బీ శంకర్ లింగం, డీ మహేందర్ రెడ్డి, జీ ఆదిరెడ్డి, సీహెచ్ అశోక్, టీ రఘువీరు, ఎండీ అఫ్సర్, ఎ జయప్రకాష్, ఎం. సారంగపాణి, రాష్ట్ర కౌన్సిలర్లు ఎ. సంజీవరెడ్డి, జీ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.