Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
విద్యా రంగ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకుడు శివరాత్రి ప్రశాంత్ అధ్యక్షతన పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడిచిన విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం కనీసం విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా పెండింగ్లోని స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.లు 3,850కోట్లను విడుదల చేయలేదన్నారు. దీంతో పలు ప్రైవేటు జూనియర్ కళాశాలలు మూసేసె పరిస్థితి దాపురించిందన్నారు. వెంటనే పెండింగ్లోని స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ సభ్యత్వాన్ని అధిక సంఖ్యలో నమోదు చేసుకొని, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా పోరాటాలలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు యార రాకేష్, హరీష్, ప్రియాంక, ప్రత్యూష, హరిణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.