Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన మహిళా రైతులను వెంటనే విడుదల చేయాలి
- మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత బలరాంనాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
గిరిజన సామాజికవర్గానికి చెందిన, స్థానిక మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు తక్షణమే పదువులకు రాజీనామా చేయాలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పోరిక బలరాంనాయక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర శివారులో మెడికల్ కళాశాల భూముల విషయంలో గిరిజన సామాజికవర్గానికి చెందిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా జైల్లో ఉన్న మహిళా ఖైదీలను బలరాంనాయక్ శుక్రవారం కలిసి మాట్లాడి పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బలరాంనాయక్ విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాలుగా తాము నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న భూముల కోసం గిరిజన మహిళలు ప్రభుత్వాన్ని నిలదీయగా అర్ధరాత్రి వేళ దొంగచాటుగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. జిల్లా కేంద్రంలో గిరిజన సామాజికవర్గానికి చెందిన మహిళా మంత్రి, మహిళా ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఉన్నా గిరిజన మహిళలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. గిరిజన మహిళలకు అండగా నిలవని మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ తక్షణమే రాజీనామా చేయడంతోపాటు బాధిత గిరిజన మహిళలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు జెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, హెచ్ వెంకటేశ్వర్లు, గుగులోత్ వెంకట్‌నాయక్, తిప్పర్తి శ్రీధర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రియాజ్ అన్సారీ, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీనాయక్, తదితరులు పాల్గొన్నారు.