Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
సమర్థవంతమైన పాలనే లక్ష్యంగా ములుగు, భూపాలపల్లి జిల్లాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆ రెండు జిల్లాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పోడుభూములు, పెండింగ్లో ఉన్న హైకోర్టు కేసులు, తదితరాలపై శుక్రవారం సమీక్షించారు. తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల్లో రికార్డులను స్కాన్ చేసి కంప్యూటరీకరించే విధానం, మేడారం జాతరలో సందర్శకుల కోసం కల్పించాల్సిన సదుపాయాల ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి అర్హులకు హక్కు పత్రాలు అందించవచ్చని చెప్పారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న హైకోర్టు కేసులను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల అభివద్ధి అధికారులు కార్యాలయాల్లోని ఫైళ్లను ఈ-ఆఫీస్ ఫైల్ మేనేజ్మెంట్లో భద్రపర్చాలని చెప్పారు. మేడారం జాతర సమీపిస్తున్న క్రమంలో అవసరమైన వసతులు కల్పించేందుకు కమిటీని వేసి నివేదికలు తయారు చేసి చర్యలు చేపట్టాలన్నారు. స్నానఘట్టాలు, టాయిలెట్లు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో భూపాలపల్లి, ములుగు ఆర్డీఓలు శ్రీనివాస్, రమాదేవి, భూపాలపల్లి సీపీఓ శ్యామూల్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.