Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విస్మరించి కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ విమర్శించారు. మండల కేంద్రంలోని వేజెళ్ల సైదులురావు భవన్లో తోడుసు యాదగిరి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల ఓట్లతో గద్దెనెక్కి కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ మోసపూరితం గా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రజలపై ఎనలేని భారాలు మోపుతున్నాయని చెప్పారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగేలా తప్పుడు విధానాలు అవలంభిస్తున్నట్టు వివరించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేలా మూడు నష్టదాయక చట్టాలను తీసు కొచ్చిన కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు ఉద్యమిస్తుండగా దాడులు, దౌర్జన్యాలు చేస్తుండడం దుర్మార్గమన్నారు. ప్రజలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా తయారైనట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశం లో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మండ రాజన్న, మండల కార్యదర్శి నంబూరి మధు, మండల నాయకులు బి వెంకన్న, వి వెంకన్న, చంటి, మోహన్, రమేష్, విజయ, ఆనందరావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.