Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
శాంతి భద్రతల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసులు సేవలు చిరస్మరణీయమని, వారి త్యాగాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. ఫ్లాగ్ డేను పురస్కరించుకుని సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్, కేఎంసీ, ఎంజీఎం, గోపాలస్వామి గుడి నుంచి తిరిగి ఎంజీఎం, మున్సిపల్ కార్పొరేషన్ ఆడిటోరియం వరకు సైకిల్ ర్యాలీ కొనసాగింది. ట్రై సిటి సైకిల్ ర్యాలీ నందు కేఎంసీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఇండోర్ స్టేడియం షటిల్ క్రీడాకారులతో పాటు పోలీసు అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ కొనసాగిన మార్గం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికల్లో పోలీస్ కమిషనర్‌తో పాటుగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఔత్సాహికులను స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు కేఎంసీ విద్యార్థులు, ఎంజీఎం సిబ్బందిపూలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరులను స్మరిస్తూ ఈ సైకిల్ ర్యాలీలతో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణత్యాగం చేసుకున్న పోలీసు అమరవీరుల కుటుంబాల బాసటగా నిలువాలన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమించేది పోలీసులు మాత్రమేనని, ముఖ్యంగా పోలీసులు తమ కుటుంబ సంక్షేమం కన్నా సమాజం క్షేమం కోసమే శ్రమిస్తారని ఆయన తెలియజేశారు.ఈ ర్యాలీలో ఈస్ట్ జోన్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, పుష్ప రెడ్డి, అదనపు డీసీపీలు భీమ్ రావు, సంజీవ్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, గిరికుమార్ కలకోట, శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు గణేష్, మల్లేశం, వేణుమాధవ్, జనార్దన్, రాఘవేందర్ పాల్గొన్నారు.