Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలి
- ప్రజలు బుద్ధిచెప్పాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకురాలు నలిగంటి రత్నమాలు,
పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకురాలు నలిగంటి రత్నమాల, సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్యలు అన్నారు. శుక్రవారం రంగశాయిపేట ఏరియా 4వ మహాసభ నక్కలపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కామ్రేడ్ ఉసిల్ల అంజయ్య పార్టీని జెండాను ఆవిష్కరించారు. అనంతరం కా||సాంబమూర్తి, ప్రత్యూషల అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులుకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్, పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కోడ్లుగా విభజించి యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఆ రంగం నీర్విర్యం అవుతుందని వాపోయారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు పోరాటం చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసుల నమోదు చేసి వారిని అణగదొక్కుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య తదితర హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుధ్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం రంగశాయిపేట ఏరియా కార్యదర్శి ఎం సాగర్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సింగారపు బాబు, అక్కినపెల్లి యాదగిరి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వలదాసు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.