Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
- ఉమ్మడి జిల్లాలోని పోడుభూములపై సమీక్ష
నవతెలంగాణ-ములుగు
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అటవీ శాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారుల సమన్వయంతో వ్యవహరించాలనిలామె కోరారు. జిల్లా కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ శాఖ క్రిస్టినా చాంగ్తు, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ శోభ, అదనపు పీసీసీఎఫ్ మోహన్ చంద్రలతో కలిసి ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, డీఎఫ్ఓలు, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో పోడు భూములు, అడవుల పరిరక్షణ, హరితహారంలపై శుక్రవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడారు. జిల్లాలోని అటవీ భూములను పరిరక్షించాల్సిన భాద్యత అధికారుల మీదే ఉందని స్పష్టం చేశారు. ఏయే జిల్లాల్లో ఎక్కువ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందని, ఏయే తెగలు నివాసం ఉంటున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి గతంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఎంత మందికి, ఎన్ని ఎకరాలకు పట్టాలు అందించాలనే విషయమై సమగ్ర సమాచారం అందించాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ మాట్లాడుతూ పోడు భూముల, అడవుల సంరక్షణ, హరితహారం సంబంధిత విషయాలపై ప్రభుత్వ నిబంధనలు, ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్‌లోని అంశాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. పోడుభూముల సమస్యలపైనా, పీసా చట్టం కింద ఏయే గ్రామాలున్నాయన్నారు. గ్రామసభల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. అనంతరం సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడారు. ములుగు, భూపాలపల్లి, వరంగల్లు, మహబూబాబాద్ జిల్లాల్లో అటవీ భూమి ఎక్కువగా ఉన్న క్రమంలో వాటిని కాపాడడంతోపాటు పోడు భూముల విషయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. సమస్యను ప్రజలకు వివరించి వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లోని అటవీ విస్తీర్ణం, పోడు భూములు సమస్య, హరితహారంలపై ఉన్నతాధికారులకు వివరించారు. సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు కష్ణ ఆదిత్య, గోపీ, శశాంక, తదితరులు పాల్గొన్నారు.