Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు తుటి దేవదానం
- కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-జనగామ
రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, పరువు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే ఎస్సీ, ఎస్టీ కమీషన్లకు చైర్మన్లను నియమించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తుటి దేవదానం డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదురుగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బందు కేవలం హుజూరాబాద్‌కే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. మూడేండ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఇండిస్టీయల్ ద్వారా అందుతున్న రుణాలకు సబ్సిడీలు రావడం లేదన్నారు. దళితులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని వాపోయారు. దళితులను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని అనడం పచ్చి బూటకమన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు భూములు ఇవ్వక పోగా వారు కాస్తు చేసుకుంటున్న అసైన్డ్, ఇనామ్, పంచారయి భూములను డంపింగ్ యార్డు, పల్లె ప్రకతి వనం పేరా ప్రభుత్వం గుంజుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహితులకు ఇస్తామన్నా పరిహారం గత మూడు సంవత్సరాలుగా అందడం లేదన్నారు. అనంతరం ఏఓ మురళీధర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు యాదగిరి, బొట్ల శ్రవణ్, శగ సంబరాజు, బెల్లంకొండ వెంకటేష్, పల్లెర్ల శంకర్, జేరిపోతుల యకయ్య, డప్పు నర్సింహ, కొత్తపల్లి మధు, తదితరులు పాల్గొన్నారు.