Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ డాక్టర అల్లెం అప్పయ్య
నవతెలంగాణ-ములుగు
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో 'గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం-1994' అమలు అడ్వైజరీ కమిటీ సమావేశం శనివారం నిర్వహించగా ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. లింగ నిర్ధారణ చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత వైద్యుల లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో 12 అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లుండగా ఎనిమిది మాత్రమే నడుస్తున్నట్లు తెలిపారు. గర్భం దాల్చక ముందు, తర్వాత స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దని చెప్పారు. సైగలు, బొమ్మలు, ఇతర పద్ధతుల్లో కూడా గర్భంలో ఉన్న శిశువు ఆడ, మగ అనేది తెలుపకూడదని చెప్పారు. లింగ నిర్ధారణ చేయిస్తే గర్భిణి భర్త, బంధువులపైనా చర్యలుంటాయని తెలిపారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రాథమిక వైద్యం మాత్రమే అందించాలని సూచించారు. చట్టం అమలును జిల్లా కలెక్టర్, జడ్జి, డీఎంహెచ్ఓ, స్వచ్ఛంద సంస్థలు, న్యాయ నిపుణులు పర్యవేక్షిస్తారని చెప్పారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యల సమాచారం 104, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్లకు అందించాలని కోరారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో శిశు వైద్య నిపుణుడు డాక్టర్ చిరంజీవి, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సునీత, మధురిమ, డీపీఆర్వో ప్రేమలత, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాంబశివరావు, సోషల్ వర్కర్ మాధురి, డెమో నవీన్, రాజ్‌కుమార్, హెల్త్ ఎడ్యూకేటర్లు ప్రతాప్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.