Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
పరీక్షల సాకుతో విద్యార్థుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రయివేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు యార రాకేష్ అధ్యక్షతన శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న సమ యంలో పెండింగ్లోని స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతోందన్నారు.
మరోపక్క వరంగల్ జిల్లాలో కొన్ని ప్రైవేట్ కళాశాలల యజమాన్యం డబ్బులు ఇస్తేనే విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తున్నాయన్నారు కళాశాలల యాజమాన్యాలు ఈ పరీక్షల సమయంలో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించి డబ్బులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రశాంత్, సుమన్, శ్రీకాంత్, నరేష్, శ్రీనివాస్, కష్ణ తదితరులు పాల్గొన్నారు.