Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ ముందుకు సాగుతోం దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏఎస్ ఆర్ గార్డెన్లో శనివారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి జిల్లా ఇన్ ఛార్జి మాడుగుల భద్రయ్య అధ్యక్షత వహించగా ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం మేనిఫెస్టోగా దేశంలోని మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే బహుజనులు ఆర్థిక, సామాజిక, విద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి చెందుతారని చెప్పారు. రాబోయే రెండేండ్లలో పార్టీనీ బలోపేతం చేసేలా కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. మాయావతిని ప్రధానిని చేయాలని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని ఆకాంక్షించారు. దేశంలో బ్రాహ్మణవాదులకు, బహుజనులకు నడుమ యుద్ధం జరుగుతోందన్నారు. బహుజనులు ఓటమి పాలైతే తిండి, బట్ట, నీడ కరువౌతాయని చెప్పారు. ఇప్పటివరకు బ్రాహ్మణవాదులు రాష్ట్రాన్ని పాలించి బహుజనులను బానిసలుగా మార్చారని మండిపడ్డారు. పార్టీ బలోపేతం చేసి బహుజన ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ బహుజనుల బతుకుల బాగు కోసం ఉద్యోగాన్ని వదిలి ప్రజల్లోకి వచ్చారని చెప్పారు. జిల్లాలో, అన్ని నియోజకవర్గాల్లో నీలి జెండా ఎగరేసి పార్టీ అభ్యర్థిని చట్టసభలకు పంపించాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా తిక్క ఉదరుకుమార్ను నియమిస్తూ లేఖ అందించారు.
బీఎస్పీలో పలువురి చేరిక
జిల్లాలోని ప్రముఖ వ్యాపారవేత్త, జిల్లా మైనార్టీ నాయకుడు మహ్మద్ ఖాజా పాషాతోపాటు సుమారు 100 మంది అతడి అనుచరులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో బీఎస్పీలో చేరారు. అలాగే నాగుల అరవింద్ సైతం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకుడు ఖాజా పాషా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో భూపాలపల్లిలో నీలిజెండా ఎగరేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంధం శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శనిగరపు రాజు, జిల్లా అధ్యక్షుడు మహేందర్, జిల్లా కోఆర్డినేటర్ తిక్క ఉదరు, ప్రవీణ్, ములుగు జిల్లా కోఆర్డినేటర్ మైస సతీష్, శనిగరపు నరేష్కుమార్, ములుగు పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు పవన్‌తేజ్, డాక్టర్ సదన్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి దూడపాక సుమన్, కాడపాక రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.