Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిశానిర్దేశం చేయనున్న హుజురాబాద్ ఫలితం కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి :
హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఈ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్ధేశం చేయనున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం హన్మకొండలోని హరిత కాకతీయ హౌటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్‌లో ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. ఇక్కడ బీజేపీ గెలుపు ఖాయమైందన్నారు. ఈ ఎన్నిక గెలుపు కోసం జరగడటం లేదని మెజార్టీ కోసమే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందన్నారు. తండ్రి, కొడుకుల పాలన, బావ, బామ్మర్ధుల పాలన, మామ, అల్లుళ్ల పాలన అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు బీజేపీ వైపే వున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వారు బీజేపీకీ మద్దతు ఇస్తున్నారన్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని హుజురాబాద్‌లోనూ సాధిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. టీిఆర్‌ఎస్ నేతలు అనేక అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని టీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.
సీఎం కేసీఆర్ ముందు పన్ను తగ్గించుకోవాలే..
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సీఎం కేసీఆర్ భావిస్తే, ముందు వాటిపై రాష్ట్రానికి వచ్చే పన్నులు, ధరలు తగ్గించి ఓట్లు అడగాలని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ను ఓడించాలని, ఈటలను గెలిపించాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రాలు ఆపే అధికారం లేదన్నారు. మహిళలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వున్నారన్నారు.
టీఆర్ఎస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా..
హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ప్రచారం చేస్తుంటే శుక్రవారం టీిఆర్‌ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఒక కేంద్ర మంత్రిని, తెలంగాణ బిడ్డను, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నన్నే ప్రచారంలో అడ్డుకుంటే ఇక ఎన్నికలు స్వేచ్ఛగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇతర పార్టీల నేతల ఇండ్లపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే కేంద్ర బలగాలు అవసరమయ్యాయన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ సమావేశంలో వరంగల్ అర్భన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, సంకినేని వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి డాక్టర్ మురళీధర్‌గౌడ్, కోనేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.