Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముమ్మరమైన ప్రచారం
- ఆరోపణలు, ప్రత్యారోపణలు
- సర్వత్రా ఉత్కంఠభరితం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరింది. శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఇటు విపక్షాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం ఆద్యంతర ఆసక్తికరంగా మారింది. కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌షా, సీఎం కేసీఆర్ ప్రచారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తరుపున కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి గత మూడ్రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా, అధికార టీఆర్ఎస్కు చెందిన మంత్రులు టీ హరీశ్‌రావు తదితర మంత్రులు టీఆర్ఎస్ గెలుపు కోసం ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఈటల రాజేందర్‌ను కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా టీఆర్ఎస్ మంత్రులు అభివర్ణించడాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, అనంతరం టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్ అని, ముందు నుండి కాంగ్రెస్‌తో జతకట్టిన నేత సీఎం కేసీఆరేనన్నారు. దేశంలో మాకు కాంగ్రెస్ ప్రత్యర్థని, ఎక్కడా ఈ రెండు పార్టీలు కలిసిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర మంత్రి ప్రచారాన్ని అడ్డుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడంతో ఉప ఎన్నికకు మరిన్ని కేంద్ర బలగాలు వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతుంది.
హుజురాబాద్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, సీఎం కేసీఆర్, టీిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా వున్నాయి. ఇక్కడ ఈ ఎన్నికల ఇన్ఛార్జిగా మంత్రి టీ హరీశ్‌రావు వ్యవహరిస్తున్నారు. హరీశ్‌రావే అంతా తానై ఈ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిన రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేదేం లేదని, ఉప ఎన్నికకు ప్రాధాన్యతనివ్వడం లేదని మంత్రి కేటీఆర్ మాట్లాడడం టీఆర్ఎస్ వర్గాల్లోనే కాకుండా, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికలపై సీఎం కేసీఆర్ సైతం లెక్కలోది కాదని కొట్టిపారేయడం కూడా చర్చకు దారితీసింది. ఒకే కుటుంబానికి చెందిన సీఎం, ఇద్దరు మంత్రులు తలో మాట మాట్లాడడం పార్టీ శ్రేణులను నివ్వెరపరిచింది. హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే ఈ ఎన్నికల నేపథ్యంలో 'దళితబంధు' వంటి పథకాన్ని రూపకల్పన చేసి హుజురాబాద్ నియోజకవర్గంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు అమలు చేస్తారు ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను ఓడించి, మరో నేత తమకు వ్యతిరేకంగా గొంతెత్తే ధైర్యం చేయొద్దన్న సంకల్పంతో టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైకి మాత్రం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రచారం వుండేనా..?
సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ప్రచారం చేయడంపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలు, కోవిడ్ నిబంధనల నేపథ్యంలో నియోజకవర్గంలో కాకుండా, దాని పరిసరాల్లో సభ నిర్వహించాలని భావించినా అధికారికంగా టీఆర్ఎస్ నాయకత్వం నేటికీ ప్రకటించలేదు. ఇదిలావుంటే సీఎం కేసీఆర్ రోడ్డు షోలతో ప్రచారం చేస్తారన్న లీకులు బహిర్గతమయ్యాయి. దీంతో సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా ? లేదా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా, ఒకట్రెండు రోజుల్లో సీఎం ప్రచారం చేసే విషయంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
కేంద్ర హౌంశాఖ అమిత్ షా ప్రచారంపై సందేహాలు..?
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌షా నియోజకవర్గంలో ప్రచారానికి వస్తారని బీజేపీ నేతలు ముందు నుండి చెబుతూ వచ్చారు. తాజాగా ఆయన పర్యటనపై సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, మెజార్టీ కోసమే ప్రచారం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతూ కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌షా ప్రచారం అవసరం లేదని, ఇది తన అభిప్రాయమని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అవసరమైతే అమిత్‌షా ప్రచారం చేస్తారని కూడా తెలిపారు. దీంతో కేంద్ర హౌంమంత్రి ప్రచారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ ప్రచారం షురూ..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హుజురాబాద్ ఎన్నికల ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. వీణవంక మండలంలో ప్రచారం ప్రారంభించిన రేవంత్‌రెడ్డి ఆదివారం కమలాపూర్ మండలంలో ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ గెలుపు కోసం ఇప్పటికే మండలాలవారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరో ఐదు రోజులే ప్రచారానికి గడువుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి.