Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
- వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సుబేదారి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ స్కూల్స్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021 విజయవంతం కోసం విద్యార్థులు సిద్ధం కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. శనివారం ఆయన కలెక్టరేట్లో స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021 పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్య (తెలంగాణ ప్రభుత్వం), తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐఎస్), యూనిసెఫ్, ఇంక్వి లాబ్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పాఠశాల స్థాయి విద్యార్థులకు డిజైన్ థింకింగ్‌లో శిక్షణను యిచ్చి, నూతన ఆవిష్కరణలు తీసుకురావడం కోసమే గతేడాది నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం డీఈఓ కే నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో 133పాఠశాలల నుంచి 345 నూతన ఆలోచనలను పంపగా, రాష్ట్రస్థాయి 25 ఉత్తమ ఆవిష్కరణలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పున్నేలు విద్యార్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని అక్టోబర్ నుంచి జనవరి మాసాలలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆన్లైన్ కోర్సు పూర్తి చేసి చివరలో నూతన ఆలోచనలు పంపించాలని పేర్కొన్నారు. గతేడాది వలెనే అన్ని పాఠశాలల నుంచి ఎక్కువ సంఖ్యలో నూతన ఆవిష్కరణలు పంపి హనుమకొండ జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందుంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి పీ సురేష్ బాబు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ రాధ, ప్లానింగ్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.