Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
ఐటీడీఏకు పీఓగా ఐఏఎస్ అధికారిని నియమించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆలం కిషోర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో కబ్బాక లక్ష్మణ్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా కిషోర్ హాజరై మాట్లాడారు. గిరిజనాభివద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ఐటీడీఏకు పీఓను రాజకీయ కుట్రలతో బదిలీ చేసి మూడు నెలలు గడిచిందని, ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదని తెలిపారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఉపయోగం లేదన్నారు. కలెక్టర్ పాలన ఆదివాసీల జీఓలు, హక్కులు, చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. షెడ్యుల్డ్ ప్రాంత జీఓలకు వ్యతిరేకంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నారంటూ కలెక్టర్ తీరును ఎండగట్టారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అడిషనల్ కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం ఐటీడీఏకు పీఓను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. నాన్ ఐఏఎస్‌ను పీఓగా నియమించి మేడారం జాతర నిధులు దోచుకునే కుట్ర జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఐఏఎస్ అధికారిని పీఓగా నియమించని పక్షంలో ఉద్యమాలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎట్టి ప్రకాష్, ఏటూరునాగారం మండల అధ్యక్షుడు ఈసం రాజు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గట్టిపల్లి అర్జున్, తదితరులు పాల్గొన్నారు.