Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో మాదక ద్రవ్యాలు అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని వివిధ పాన్, కిరాణా షాపుల్లో డీఎస్పీ సంపత్‌రావుతో కలిసి అదనపు ఎస్పీ సోమవారం అకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీనివాసులు మాట్లాడారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయించొద్దని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల యువత మత్తుకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ప్రజలు గంజాయి, మాదక ద్రవ్యాల సంబంధిత సమాచారం అందిస్తే నగదు బహుమతి ఇస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ వాసుదేవరావు, ఎస్సై అభినవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి : మండల కేంద్రంలోని పాన్, కిరాణా షాపుల్లో సీఐ వెంకట్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు. ప్రభుత్వ నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లు, గంజాయి తదితర మత్తు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.
మల్హర్రావు : కొయ్యూర్ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడిచెర్ల, మల్లారం, కొయ్యూర్ గ్రామాల్లోని కిరాణా, పాన్ షాపులతోపాటు హోటళ్లలో పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. ప్రభుత్వ నిషేధిత గుట్కా, అంబర్, గంజాయి, నాటు సారాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కాటారం : సీఐ రంజిత్‌రావు ఆధ్వర్యంలో గారెపల్లిలోని పలు పాన్, కిరాణా షాపుల్లో తనిఖీ చేశారు. గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారస్తులకు సీఐ కౌన్సెలింగ్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్సైలు భాస్కర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.