Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
యాసంగిలో వరికి బదులు మెట్ట పంటలు పండించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా రైతులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో పంట మార్పిడి వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. ఈ క్రమంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సీఎం కేసీఆర్ సూచించిన క్రమంలో జిల్లాలోని రైతులందరూ ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు. రైతులు వరిధాన్యాన్ని పండించి దాన్ని అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వ్యవసాయ విశ్వవిద్యాలయ సహకారంతో వ్యవసాయ శాఖ ముందస్తుగా రాష్ట్రంలోని రైతుల కోసం ఉపయోగకరమైన ప్రత్యామ్నాయ పంటలను గుర్తించిందని చెప్పారు. వరి ధాన్యానికి బదులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే అవకాశమున్నా మెట్ట పంటలైన వేరుశనగ, నువ్వులు, శనగ, మినుములు బొబ్బర్లు, పెసర్లు, అలసంద, సన్ఫ్లవర్, ఆముదాలు, కుసుమ, కొత్తిమీర, తదితర 11 రకాల పంటలను పండించి లబ్ధి పొందాలని తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను జిల్లాలో రైతులకు ఇబ్బంది కలగకుండా విత్తనాల కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే వచ్చే వారంలో వరుసగా మూడ్రోజులపాటు జిల్లాలోని రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజరుభాస్కర్, జిల్లా ఉధ్యాన అధికారి అక్బర్, డీపీఆర్వో రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.