Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-తొర్రూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ కోరారు. మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమిరెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్ట బెడుతోందని విమర్శించారు. నష్టదాయక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను ఆదుకోకుండా అణచివేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర మంత్రి కుమారుడు తన కాన్వారును రైతుల మీదుగా నడిపించి నలుగురి మరణానికి కారకుడయ్యా డని చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం దారుణమన్నారు. దేశంలో నిరుద్యోగ, ఆకలి సమస్యలు పెరుగుతుండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లకు పడగలెత్తినట్టు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి హుజురాబాద్ ఉపఎన్నికల చుట్టూ తిరుగుతున్నాడని తెలిపారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతున్నారని చెప్పారు. ఎన్నికతో రాష్ట్రంలో పాలన కుంటుపడిందని ఆందోళన వెలిబుచ్చారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాల పేదలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పాలకుల తప్పుడు విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు వై వెంకటయ్య, మండల కార్యదర్శి యాకూబ్, నాయకులు బొల్లం అశోక్, దర్గయ్య, స్వామి సాంబయ్య, సురేష్, మమత, సాయి మల్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.