Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఇన్ఛార్జి ఏఎస్పీ యోగేష్ గౌతమ్
- మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన సదస్సు
నవతెలంగాణ-తొర్రూరు
గంజాయి, గుట్కా, గుడుంబా, తదితర నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఏఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిరోధంపై మంగళవారం నిర్వహించిన అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పలు ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణా జరుగుతున్నట్లు ఉన్న సమాచారం మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. కిరాణా, పాన్ షాప్ల యజమానులు గంజాయి, గుట్కా అమ్మితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. షాప్ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు జైలు, జరిమానా పడే అవకాశం ఉందన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇస్తున్న ఉచిత శిక్షణను అర్హులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఐ కరుణాకర్, ఎస్సై గుండ్రాతి సతీష్, సెకండ్ ఎస్సై రాంజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.