Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగదీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తుల విక్రయం
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ అవలంభిస్తున్న తప్పుడు విధానాలపై కార్మికులు పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ, నగదీకరణ పేరుతో దేశంలోని లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతోందని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఆ యూనియన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కుంట ఉపేందర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో రాములు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నగదీకరణ వల్ల 26 వేల కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్లు, 29 వేల కిలోమీటర్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు, జలవిద్యుత్ కేంద్రాలు, పెట్రోల్ ఉత్పత్తుల పైప్లైన్ రవాణా మార్గాలు, 400 రైల్వేస్టేషన్లు, ఎఫ్సీఐ గోడౌన్లు, తదితరాలు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లనున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మికుల హక్కుల కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరణ పేరుతో నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నవంబర్ 16 నుంచి 18 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న యూనియన్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారని చెప్పారు. సమావేశంలో యూనియన్ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, జిల్లా నాయకులు సమ్మెట రాజమౌళి, కుమ్మరికుంట్ల నాగన్న, పోతుగంటి మల్లయ్య, జల్లె జయరాజు, పెరుమాండ్ల బాబుగౌడ్, వెలిశాల సుధాకర్, తాడబోయిన శ్రీశైలం, దాసరి మల్లేష్, యాకూబ్, వాసం దుర్గారావు, తోట శ్రీను, పాలబిందెల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.