Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలక ప్రభుత్వాలపై నిరుద్యోగులు తీవ్ర అసహనం
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటూ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలంతా సోషలిస్టు భావజాలంతో ఎర్రజెండా నీడలో సమసమాజ స్థాపనకు భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల్ని నిర్మించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పిలుపునిచ్చారు. డివిజన్ కేంద్రంలో మంగళవారం స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్ మండలాల ఏరియా మహాసభ అమరజీవి మంతెన అజరు రెడ్డినగర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ఏడేండ్ల పాలనలో అనేక వాగ్దానాలు చేసి నేడు విస్మరించారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు లక్షల ఎకరాల్లో అన్యాక్రాంతమవుతున్నాయని, దళితులకు 3 ఎకరాల హామీని విస్మరించి హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు పేరుతో మరోమారు మోసం చేయాలని చూస్తున్నారన్నారు. నాడు ఆంధ్ర పాలకులు నీళ్లు, నిధులు కొట్టుకుపోతున్నారని విమర్శించి, స్వరాష్ట్ర పాలనలో కసీఆఆర్ చేసిందేమీ లేదన్నారు. శ్రీరాంసాగర్ , కంతనపల్లి ప్రాజెక్టునిర్మాణానికి సీపీఐ(ఎం) తరపున పాదయాత్రలు చేశామని, రెండవ దశలో తుంగతుర్తి వరకు వెళ్లిన కాలువ అలాగే ప్రాజెక్టు పూర్తయితే వరంగల్ ప్రాంతమే కాకుండా నల్గొండ సూర్యాపేట భువనగిరి సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. కంతనపల్లి ప్రాజెక్టు కేసీఆర్ అర్థాంతరంగా నిలపారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అనానరు. రాష్ట్రమంతా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అంటున్న కేసీఆర్, కేంద్ర విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు తెచ్చి, రాష్ట్ర హక్కుల్ని హరించి వేస్తుంటే మాట్టాడకుండా నిరసన తెలుపకుండా ఉచితవిద్యుత్ భవిష్యత్తులో ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని అంబానీ, అదాని వంటి ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పచెప్పి విద్యుత్ సబ్సిడీ ఎత్తివేస్తూ, ప్రజలపై మరింత భారంమోపతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి రాబోతుందని వాపోయారు. ధాన్యం పండించడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానం అని చెబుతూనే, ప్రస్తుతం వరి పండిస్తే ఉరేనని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని తప్పించుకుంటున్నారన్నారు. రైతులు ప్రస్తుతం వర్షాభావ కారణాలవల్ల తీవ్రంగా నష్టపోయారని, ఇటీవల సర్వేలో రాష్ట్రంలో ప్రతి రైతుకు ఒక లక్షా 50 వేల రూపాయలు అప్పుగా ఉందని తెలిపారు. అప్పులబాధ, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని అన్నారు. కేంద్రం నల్ల చట్టాలు తెస్తే కేసీఆర్ రైతుల పక్షాన పోరాడిండి ఎక్కడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా, ఎన్నికల సమయంలో తప్ప నియామకాలు గుర్తుకు రావా అని ప్రశ్నించారు. ఉప ఎన్నిక సందర్భంగా 80 వేల పోస్టులను నింపుతామని, రాష్ట్రంలో 40 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగ వుండగా ఉద్యోగ, ఉపాధి చూపించకుండా కెసిఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం అన్ని ఐటీి కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయని ఊదర గొడుతున్నారని విమర్శించారు. 25 శాతం రైతులకు కూడా నేటికీ అప్పు ఇవ్వకపోగా, రుణమాఫీ సైతం అంతంత మాత్రమేనని, ఉపాధి హామీ పనుల నిమిత్తం నిధుల కోసం కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి ఏమైనా ఉందా అని అన్నారు. కరోనా విపత్తులో గోడౌన్లలో మగ్గుతున్న ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని, ప్రతి కుటుంబానికి రూ. 7500 వారి ఖాతాలో జమ చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయన్నారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్కరికి 15 లక్షలు జమ చేస్తామని నమ్మబలికిన గజదొంగ మోడీ ప్రభుత్వమని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారన్నారు. నవంబర్ 26 నాటికి ఏడాది కావస్తున్నదని, ఎముకలు చీల్చే చలిలో 630 మంది రైతులు చనిపోయారని, ఇది చారిత్రకపోరాటమన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో పోరాటాలు ఉధృతం చేయాలని, రెండు మండలాల్లో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం,ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు ఎన్నకూస కుమార్, మునిగెల రమేష్, సాదం రమేష్, తోట రమేష్, కార్యదర్శులు కత్తుల రాజు, అక్కనపల్లి వెంకన్న, పిట్టల నరేందర్, పొలాసు సాంబయ్య, ఎదునూరి యాకయ్య, దామెర నర్సింహులు, సాదం శ్రీనివాస్, తోడేం గల ఐలయ్య, వంగపండ్ల సోమయ్య, చిలుముల్ల భాస్కర్, ప్రభాకర్, నాగరాజు, దైద అనిల్, మహేందర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.