Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడే ఎన్నికలు
నవతెలంగాణ-మట్టెవాడ
ఐఎంఏ వరంగల్ 2022 నూతన కార్యవర్గం ఎన్నిక కోసం సర్వం సిద్ధం అయ్యాయి. గత ఆరేండ్లుగా ఏకగ్రీవం అవుతున్న ఎన్నికలు, ప్రస్తుతం అందుకు భిన్నంగా పోరుకు సిద్ధం అయ్యాయి. రాజకీయ ఎన్నికల పోరు కు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1500 మంది ఓటర్లను ఆకర్షించి తమ వైపు తిప్పుకుని తమ అనుకూల వర్గాన్ని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రలోభాల పర్వానికి తెర లేపాయి. పదిరోజులుగా వైద్యులు వర్గాల వారీగా చీలిపోయి, ఎవరికి వారు క్యాంపులు నడుపుతూ మందు పార్టీలతో దుమ్ము రేపడంతో ఐఎంఏ వరంగల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారాయి. ఐఎంఏ వరంగల్ కార్యవర్గంలో ఎన్నికైన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలోని తానా, ఐఎంఏ వంటి వైద్య సంఘాల్లో కీలక సభ్యులుగా ఎంపిక అవుతున్నారు. దీంతో ఎలాగైనా అధ్యక్ష పదవిని దక్కించుకోవాలనే పట్టుదల కారణంగానే ఏకగ్రీవానికి స్వస్తి పలికి ఎన్నికలకు సిద్ధం అయ్యారు.
గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్న నాయకులు
ఈ నెల 25వ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పలు పదవులు ఏకగ్రీవం అయ్యాయి. కాగా ఐఎంఏ వరంగల్ అధ్యక్ష పదవి కోసం డాక్టర్ వద్దిరాజు రాకేష్, డాక్టర్ బైరం బాలాజీలు, ప్రధాన కార్యదర్శి పదవి కోసం డాక్టర్ నాగార్జున రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్, కోశాధికారి పదవి కోసం బింగి శ్రీనివాస్, డాక్టర్ సనత్ కుమార్ తుంగతుర్తిలు పోటీ చేస్తున్నారు. నేడు (గురువారం) ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థానిక ఐఎంఏ వరంగల్ క్యాంపస్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహించనున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికివారు తమ గెలుపుపై దీమాను వ్యక్తం చేస్తున్నారు.