Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- పరకాల
పట్టణంలో స్థానిక సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్ అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ కేంద్రంలో డ్రైనేజీ కాలువలు లేవన్నారు. ప్రధాన రహదారులు సరిగా లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగు తున్నాయన్నారు. అంబేద్కర్ సెంటర్ దగ్గర రోడ్డు సరిగా లేకపోవడంతో దుమ్ము, ధూళితో వాహనదారులు, పట్టణ ప్రజలు అనేకమంది ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారనీ పేర్కొన్నారు. పరకాల ఎంట్రెన్స్‌లో స్పీడ్ లిమిట్ పెట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ కేంద్రంలో సీసీ రోడ్లు గుంతల మయం కావడంతో రాత్రిపూట ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నల్లాల పైపుల వలన గల్లీలలో రోడ్లు పాడైపోయాయని, వాటిని కూడా మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, చైర్మన్, కౌన్సిలర్స్ స్పందించి సమస్యలను పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 19 వ వార్డు కౌన్సిలర్ పంచగిరి జయమ్మ, బొజ్జ హేమంత్, ఎండీ అక్రమ్, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.