Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
మహిళల ఆర్థిక ఎదుగుదల, సామాజిక సమస్యల పరిష్కారంలో సమాఖ్యాలు ముఖ్య భూమిక పోషించాలని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బుధవారం స్థానిక కౌన్సిల్ హాల్లో స్ర్రీనిధి వారు టీఎల్ఎఫ్ వారికీ కంప్యూటర్ల అందజేత కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిధిగా హాజరై కంప్యూటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా 12పట్టణ సమాఖ్యలు, 535ఎస్ఎల్ఎఫ్లతో పాటు 14,614 మహిళా స్వయం సహాయక బందాలు ఉన్నాయని తెలిపారు. వీటికి దాదాపు100కోట్ల రుణాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సంఘ సభ్యులు అమ్మే ఉత్పత్తులను బ్రాండ్ పేరుతో విక్రయించాలన్నారు. ఆహార సంబంధ ఉత్పత్తుల తయారీ పై సంఘాలు ప్రత్యేక దష్టి సారించాలని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం, దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేసేలా అర్హులైన మహిళలకు సహకరించాలని కోరారు. సభ్యులు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అట్టి సమస్యలను స్థానిక కార్పొరేటర్ సహకారంతో పరిష్కరించేలా చూడాలని పేర్కొన్నారు. చెత్త సేకరణ, తరలింపు కార్యక్రమాలకు కార్పొరేషన్ కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని, అనుకున్న కార్యక్రమాలు విజయవంతం అవ్వాలంటే మహిళల సహకారం, భాగస్వామ్యం అవసరమన్నారు. ఆర్పీలకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రాజెక్ట్ అధికారి విజయలక్ష్మి, జిల్లా శ్రీనిధి ఆర్ఎం అశోక్, శ్రీనిధి మేనేజర్లు శ్రీనివాస్, రమేష్, టీఎంసీ రమేష్, యూఎంసీ ప్రతినిధి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.