Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత భవనాలు కరువు ఇబ్బందుల్లో ప్రజలు
నవతెలంగాణ-మల్హర్రావు
పరిపాలన సౌలభ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి గిరిజన తండాలను, 500 జనాభా కలిగిన పల్లెలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 2018 అగస్టు 2న కొత్త జీపీలు ఏర్పాటు చేసింది. కానీ, ఆయా జీపీల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కొత్త పంచా యతీల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
మండలంలో ఇప్పలపల్లి, దుబ్బపేట, మల్లపల్లి,కొయ్యుర్, అద్వాలపల్లి 5 కొత్త పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా వీటిలో మల్లంపల్లి,అడ్వాలపల్లి, దుబ్బపేట 500 జనాభా కలిగిన గిరిజన తండాలు కాగా కొయ్యుర్, ఇప్పలపల్లి మాత్రం అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఇప్పటికీ ఒక్క పంచాయతీకి కూడా పక్కా భవనాలు నిర్మించలేదు. ఇప్పలపల్లి, అద్వాలపల్లి, మల్లంపల్లి గ్రామాల్లో మూతబడిన ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగిస్తుంటే కొయ్యుర్ ఐకేపీ భవనంలో, దుబ్బపేట మాత్రం ప్రయివేటు భవనంలో పంచాయతీ పాలన కొనసాగుతోంది. అలాగే గ్రామ సభలను సైతం ఆరుబయటనే నిర్వహిస్తున్నారు. కొత్త పంచాయతీల్లోనూ ప్రజలు ఇప్పటికి రేషన్, పింఛన్ కోసం పాత పంచాయతీల వద్దకే వెళ్తున్నారు. మూడేండ్లు పూర్తైనా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టట్లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
మట్టి రోడ్లే దిక్కు
కొత్త పంచాయతీల్లో మట్టి రోడ్లే దిక్కుగా మారింది. కొత్త పంచాయతీ అన్న మాటే కానీ వసతులు, అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు పడటం లేదని తండా ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో తండా ప్రజలు బీటీ రోడ్లు లేక మట్టిదారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలన సౌలభ్యం ఏర్పడిన పంచాయతీలు రోడ్లు వేయకుండా ఏమి లాభమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించడంతోపాటు, రోడ్లు, బీటీ రోడ్లు వేయాలని, కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.