Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగుపై గందరగోళం రైతుల్లో ఆగ్రహం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
యాసంగిలో వరి సాగు చేయొద్దని, చేస్తే రైతుకు ఉరితాడేనని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి సన్నాలు మాత్రమే సాగు చేయాలని, మొక్కజొన్న, వరి దొడ్డు రకాలు సాగు చేయొద్దని గత ఏడాదంతా సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనికనుగుణంగా వరి సన్నాల సాగు గణనీయంగా పెరిగింది. ఇప్పుడు యాసంగిలో వరి సాగు చేయొద్దని సీఎం చెబుతుండడం పట్ల రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ జిల్లా పరిధిలో కమలాపూర్ మండలం వస్తుండడంతో రైతుల్లో వ్యతిరేకత రాకుండా నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోకుండా, కేవలం హన్మకొండ జిల్లాలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
యాసంగిలో వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరి సన్నాలను మాత్రమే సాగు చేయాలని, మొక్కజొన్న, వరి దొడ్డు రకాలు సాగు చేయొద్దని, వాటిని కొనుగోలు చేయమని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామగ్రామాన ఊదరగొట్టారు. తీరా వరి సన్నాలు పండించిన నేపథ్యంలో ఈ యాసంగిలో వరిని సాగు చేయొద్దని చెప్పడం రైతుల్లో గందరగోళాన్ని సృష్టించింది. ఇదిలా ఉంటే వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మాత్రమే వరి కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించడం గమనార్హం. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈనెల 30న ఉప ఎన్నికలుండడం వల్లనే రైతుల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలో భాగంగానే కమలాపూర్‌లో యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కమలాపూర్ మండలం హుజురాబాద్ నియోజకవర్గంలో వుండడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ మినహా ఇతర ఏ జిల్లాలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చకపోవడం గమనార్హం. చాలా జిల్లాల్లో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదు
ఉమ్మడి వరంగల్‌లో తీవ్ర అసంతృప్తి
యాసంగిలో వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ ప్రకటించడం, అందుకనుగుణంగా అధికారులు యాసంగిలో బోర్లు, బావుల కింద పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించడం పట్ల రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి సీజన్లో వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నారు. జనగామ జిల్లాలో గత యాసంగిలో 1 లక్షా 59 వేల 825 ఎకరాలలో వరిని సాగు చేశారు. దీనికిగాను 2.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తయ్యింది. 193 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ యాసంగిలో వరి సాగు చేయొద్దని చెప్పడం పట్ల రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహబూ బాబాద్ జిల్లాలో గత యాసంగిలో 1 లక్షా 76 వేల ఎకరాల్లో వరిని సాగు చేశారు. 3.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 150 కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేశారు. వరంగల్ జిల్లాలో వానాకాలంలో 1 లక్షా 33 వేల ఎకరాల్లో వరిని సాగు చేయగా, 3.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని ఆశిస్తున్నారు. యాసంగిలోనూ పెద్ద ఎత్తున వరిని సాగు చేస్తారు. ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం, నర్సింహసాగర్ కింద పెద్ద ఎత్తున వరి సాగు చేయడం ఆనవాయితీ. ఇప్పుడు యాసంగిలో వరి సాగు చేయొద్దని చెప్పడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హన్మకొండ జిల్లాలో సలివాగు కింద యాసంగిలో వరిని సాగు చేస్తారు. హన్మకొండ జిల్లాలో ఈ వానాకాలంలో 1.50 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. 3.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని ఆశిస్తున్నారు. గత వానాకాలంలో 1.18 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. 2.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబ డులు వచ్చాయి. ములుగు జిల్లాలో గత ఎండాకాలంలో 76 వేల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ప్రస్తుత వానాకాలంలో 1.10 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు.
కమలాపూర్‌లోనే కొనుగోలు కేంద్రం
ఈ సీజన్లో హన్మకొండ జిల్లాలో కేవలం కమలాపూర్ మండలంలో మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 141 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కమలాపూర్‌లో మాత్రం ఇంతకుముందే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం గమనార్మం. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలుండడంతో రైతుల్లో వ్యతిరేకత రాకుండా ముందు చూపుతో రాష్ట్ర ప్రభుత్వం కమలాపూర్‌లో ముందే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఇదే విషయాన్ని టిఆర్ఎస్ నేతలు సైతం ప్రచారం చేసుకోవడం గమనార్హం.
యాసంగిలో వరి వద్దంటే..
యాసంగిలో వరి సాగు చేయొద్దంటే వరంగల్, హన్మకొండ, జనగామ, ములుగు జిల్లాల్లో రైతులపై దీని ప్రభావం గణనీయంగా వుండే అవకాశముంది. సీఎం కేసీఆర్ సీజన్‌కో మాట మాట్లాడుతుండడం వ్యవసాయరంగంలో గందరగోళం సృష్టిస్తుంది. ఒకసారి వరి దొడ్డు రకాల వద్దని, ఒకసారి వరి సన్నాలు మాత్రమే పండించాలని, ఇప్పుడేమో వరి అసలు సాగు చేయొద్దని, మొక్కజొన్న సాగు చేస్తే కొనమని వ్యాఖ్యానించడం రైతులను గందరగోళపరుస్తుంది. వ్యవసాయాధికారులు సైతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలతో గందరగోళంలో పడిపోయారు.