Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ
- రెండో విడతకు సై.. సై..
- గులాబీ 'ప్యాకేజీ' రివర్స్..
- ప్రేక్షకపాత్రలో ఎన్నికల సంఘం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హుజురాబాద్ ఉప ఎన్నికల తుది ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగియడానికి ముందు రోజు నుండే నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ.6వేలు కవర్లో పెట్టి పంపిణీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వంద ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నియమించి కవర్లను అందిస్తున్నారు. కవర్‌పై ఇంటి నెంబర్, ఎంత మంది ఓటర్లున్నారో ఆ సంఖ్యను రాసి మరీ ఇంటింటికి కవర్ల పంపిణీ పెద్ద ఎత్తున జరిగింది. మంగళవారం హుజురాబాద్ మండలంలో నగదు పంపిణీని పకడ్బందీగా ప్రారంభించిన అధికార టీిఆర్‌ఎస్ నేతలు బుధవారం నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పంపిణీని యుద్ధ ప్రాంతిపదికన చేపట్టారు. ఇదిలావుంటే బీజేపీ నేతలు సైతం ఓటుకు రూ.1500 పంపిణీ చేయడంతో రెండో దశలో నగదు పంపిణీకి అధికార టీిఆర్‌ఎస్ పార్టీ నేతలు సన్నద్ధమవు తున్నట్లు సమాచారం. దసరాకు ముందే మందు, చికెన్, మటన్ పంపిణీ జరిగినా ఎన్నికల సంఘం ఎవరిపై కేసులు నమోదు చేయలేదంటే సంఘం పనితీరు ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలావుంటే అధికార టీఆర్ఎస్ రెండు నెలలుగా 100 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని పెట్టి అన్ని పనులు వారితోనే చేయించింది. ఈ ఇన్‌ఛార్జిలకు రూ.5000 ప్యాకేజీని నిర్ణయించినట్లు సమాచారం. బుధవారం ఈ ప్యాకేజీకి సంబంధించిన నగదు గురించి అడగ్గా, నేతలు విముఖతను ప్రదర్శించడంతో సదరు ఇన్‌ఛార్జిలు 'రివర్స్' ప్రచారం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
హుజురాబాద్ ఉప ఎన్నికలు అత్యంత ఖరీదుగా మారాయి. ఓటుకు రూ.6000 చొప్పున కవర్లో పెట్టి మరీ డోర్ డెలివరీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం రప్పిస్తుండడంతో అప్రమత్తమైన అధికార టిఆర్ఎస్ నాయకత్వం ప్రచారం బుధవారం సాయంత్రం 7 గంటలకు ముగియనుండగా, మంగళవారం సాయంత్రం నుండే నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించారు. బుధవారం మధ్యాహ్నాం ఇక నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లో పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇతర జిల్లాల నుండి ఆయా మండలాలు, గ్రామాలకు ఇన్ఛార్జిలుగా వున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వ్యూహాత్మకంగా ముందే ఇంటినెంబర్ల వారీగా కవర్లపై ఆ ఇంటిలో ఎంత మంది ఓటర్లున్నారో అన్ని రూ.6000 చొప్పున నగదును పెట్టి ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేశారు. నగదు పంపిణీ కార్యక్రమానికి అధికార టీిఆర్‌ఎస్ నాయకత్వం యువతను అధికంగా వినియోగించుకున్నారు. యూత్‌కు ప్యాకేజీలను ముట్టచెప్పి పని చేయించుకున్నారు. ఇతర జిల్లాల యూత్‌ను సైతం హుజురాబాద్ నియోజకవర్గంలో మోహరించి నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించారు.
టీిఆర్‌ఎస్, బీజేపీల పోటాపోటీ
అధికార టీఆర్ఎస్పార్టీ ఓటుకు రూ.6000 పంపిణీ చేయడంతో 'తగ్గేదేలే..' అన్నట్టు బీజేపీ నేతలు సైతం ఓటుకు రూ.1500 పంపిణీ చేశారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికలు ఒకవైపు నగదు, మరోవైపు మందు ప్రవాహంలో రాజకీయాలు రంజుకెక్కాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపిలు ఏ విషయంలోనూ తగ్గే పరిస్థితిలో కనిపించడం లేదు.
రెండో విడతకు సై..
అధికార టిఆర్ఎస్ పార్టీ మొదటి దశలో ఓటుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేయగా, బిజెపి నేతలు మొదటి దశలో ఎంత నగదును పంపిణీ చేస్తారో, చూసి రెండో విడతలోను మరో రూ.4వేల నుండి రూ.6వేలు ఇవ్వడానికి సన్నద్ధంగా వున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీజేపీ నాయకత్వం సైతం ఓటరుకు నగదు పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అత్యంత పకడ్బందీగా బిజెపి కూడా డోర్ డెలివరీ పద్దతిలో పంపిణీ చేయడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ సైతం కొంత మేరకు నగదు పంపిణీకి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
దసరా ముందే జోష్..
హుజురాబాద్ నియోజకవర్గంలో దసరా పండుగ, దీపావళి పండుగల ఖర్చులు మొత్తానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజకీయ పార్టీలు ఇచ్చిన డబ్బులతో ఎలాంటి భారం లేకుండా గడిచిపోయాయి. దసరా పండుగకు ముందే అధికార టిఆర్ఎస్, ఇటు బిజెపిలు ఇంటికో క్వార్టర్, కూల్ డ్రింక్స్ బాటిళ్లను సరఫరా చేశారు. ఈనెల 30న పోలింగ్ వుండడంతో మంగళవారం నుండి ఇంటింటికి నగదు పంపిణీ కార్యక్రమం ముమ్మరం కావడంతో దీపావళి పండుగ ఖర్చులు సైతం ఓటర్లకు ఇబ్బంది లేకుండా పోయింది. ఉప ఎన్నికలేమో గాని పండుగల ఖర్చులు మీద పడకుండా దాటిపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు..
గులాబీకి 'రివర్స్' ప్యాకేజీ
అధికార టిఆర్ఎస్ అత్యంత పకడ్బందీగా ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలో 100 మంది ఓటర్లకు ఇక ఇన్‌ఛార్జిని నియమించి వారితో అన్ని పనులు చేయించింది. ఒప్పందం ప్రకారం చివరకు ప్యాకేజీ కింద ఇన్ఛార్జికి రూ.5 వేలు ఇవ్వాల్సి వుండగా, ఇవ్వకపోవడంతో ఇన్‌ఛార్జిలు గులాబీలకు వ్యతిరేకంగా ప్రచారంలో దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇది టిఆర్ఎస్ నేతల్లో గుబులు రేకేత్తించింది.
ప్రేక్షకపాత్రలో ఎన్నికల సంఘం
హుజురాబాద్ ఉప ఎన్నికలో నగదు, మద్యం పంపిణీని అడ్డుకోవడంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైంది. అధికార టిఆర్ఎస్ పార్టీ, ఇటు బిజెపి నేతలు దసరా పండుగకు ముందే ఇంటికి క్వార్టర్ మద్యంతోపాటు, చికెన్, మటన్, కూల్ డ్రింక్స్‌ను పంపిణీ చేసినా, నేటికీ ఒక్క కేసు కూడా నమోదు కాని దుస్థితి వుంది. ఇంటింటికి పంపిణీ జరుగుతున్నా ఎన్నికల సంఘం అధికార యంత్రాంగం నిద్రమత్తును వీడడం లేదు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.