Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాగునీటి సమస్య-అందని 'భగీరథ'
- మధ్యాహ్న భోజనానికీ తిప్పలే
నవతెలంగాణ-తొర్రూరు
మండలంలోని గోపాలగిరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు గానూ ఒకే గది ఉంది. పాఠశాలలో మొత్తం 33 మంది విద్యార్థులుండగా వారికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఐదు తరగతులకు ఒకే గది ఉండడంతో ఒకటి, రెండు, మూడో తరగతుల విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి, నాల్గో, ఐదో తరగతులను ఒకే గదిలో బోధన నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పాఠశాల భవనం స్లాబ్పై పెచ్చులు ఊడి కింద పడడంతో విద్యార్థులు ఆందోళనకు గురౌతున్నారు. పాఠశాలకు తలుపులు, కిటికీలు సరిగా లేవు. ఒక గదిలో ఓవైపు విద్యార్థులు, మరోవైపు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం బస్తాలు ఉండడంతో తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారు. పాఠశాలకు ఉన్న రెండు గదుల్లో ఒకదాంట్లో అంగన్వాడీ స్కూల్ నిర్వహిస్తుండడంతో మిగిలిన గదిలో తరగతులు నిర్వహించాల్సి వస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో తాగునీటి ఎద్దడిని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ నీరు అందని దుస్థితి నెలకొంది. మిషన్ భగీరథ నల్లా ద్వారా సన్న పైపు ఏర్పాటు చేయడంతో నీరు రావడం లేదు. నూతన నల్లా ఏర్పాటు చేయడానికి గుంతలు తీసి, సిమెంట్ ఓడలు తెచ్చి నెలలు గడుస్తున్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.