Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వర్ధన్నపేట
ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి దేవదాసు అన్నారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ 22 మార్చి, 2021న అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఏడు నెలలైనా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు జరగలేదన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీటీఎఫ్ వర్ధన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు క్యాంపెయిన్లో భాగంగా చెన్నారం, ఉప్పరపల్లి, నల్లబెల్లి, కట్య్రాల, ఇల్లంద, వర్ధన్నపేట, దమ్మన్నపేట పాఠశాలను సందర్శించారు. దమ్మన్నపేట ఉన్నత పాఠశాలను కందుకూరి దేవదాసు జిల్లా అధ్యక్షుడు సందర్శించి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా విద్యా వ్యవస్థ ఏం మారలేదన్నారు. ఏటేటా ప్రభుత్వ విద్యకు నిధులు తగ్గిస్తూ ఆ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ఉదారవాద విధానంతో విద్యా ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ విశంఖలంగా పెరిగిపోతోందని వాపోయారు. విద్యార్థుల సంఖ్య నెపంతో పాఠశాలల మూసివేతకు, విలీనానికి, హేతుబద్ధీకరణ చేయడానికి ప్రభుత్వం దురాలోచన చేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం డీటీఎప్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 9న హైదరాబాద్ ఇందిరా పార్కులో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు పీ సోమయ్య, మండల ప్రధాన కార్యదర్శి పీ సదానందం, వేల్పుల రాజు, సునిత, సరస్వతి, అనిత, లలిత, సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.