Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ పరీక్షా కేంద్రంలో తనిఖీ
నవతెలంగాణ-మహబూబాబాద్
ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ ప్రథమ వార్షిక పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి సత్యనారాయణ పరీక్ష వివరాలను కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో 6 వేల 62 మంది పరీక్ష రాయనున్నట్ట, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో 317 మందికి 303 హాజరైనట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పరీక్ష కేంద్రంలో తాగునీటి, విద్యుత్, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. మాస్క్‌లు లేని వారికి వాటిని అందించాలని సూచించారు. కరోనా లక్షణాలుంటే క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట కళాశాల ప్రిన్సిపాల్ రూపాదేవి, తదితరులున్నారు.
పీహెచ్సీలో కలెక్టర్ తనిఖీ
మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు. కరోనా వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులతో ఇంటింటి సర్వే చేయించాలని ఎంపీఓను ఆదేశించారు. ఎంపీడీఓల వద్ద ఓటరు జాబితాతోపాటు రేషన్ డీలర్ల వద్ద లబ్ధిదారుల వివరాలు, డీఆర్డీఏ అధికారుల వద్ద పెన్షనర్ల వివరాలు, ఐసీడీఎస్ అధికారుల వద్ద గర్భిణుల పేర్లు తీసుకుని నివేదిక రూపొందించుకొని ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోని, మృతి చెందిన, వలస వెళ్లిన వారి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మొదటి డోస్ తేదీ ఆధారంగా రెండో డోస్ పూర్తి చేయాలని చెప్పారు అనంతరం ఆస్పత్రి ఆవరణను సందర్శించారు. చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, ఉప వైద్యాధికారి అంబరీష, ఎంపీడీఓ రవీందర్, వైద్యాధికారి సుధీర్, ఎంపీఓ హరిప్రసాద్, పంచాయతీ సెక్రటరీ మహేష్ తదితరులున్నారు.