Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
షెడ్యూల్డ్ ప్రాంతంలోని ఆదివాసీ గూడేల్లో దౌర్జన్యాలకు ఆజ్యం పోస్తున్న బూర్జువా పార్టీలకు గుణపాఠం చెప్పాలని తుడుందెబ్బ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి ఆగబోయిన రవి కోరారు. మండల కేంద్రంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి రాజు అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశానికి రవి హాజరై మాట్లాడారు. పాలకులు ఆదివాసీలను ఛిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. అన్ని విధాలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. పాలక పార్టీలు ఆదివాసీల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు అదివాసీల సంస్కతి, సంప్రదాయాలను దెబ్బ తీస్తున్నాయని తెలిపారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న రాజ్యాంగ హక్కులను, చట్టాలను పాలకులు అస్థిర పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు ఐక్యఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో నాయకులు సిద్దబోయిన సంజీవ్, కుంజ నర్సింగరావు, ఈక విజరుకుమార్, వజ్జ రవి, అల్లెం జంపయ్య, సిద్దబోయిన జీవన్, దారం సమ్మయ్య, దారం వీరస్వామి, బిజ్జ నర్సయ్య, సువర్ణపాక వెంకటరత్నం, పొడుగు సురేష్, పెనుక వెంకన్న, ఈసం కాంతారావు, గుంట సంపత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.