Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
మద్యం మత్తులో మహాత్మాజ్యోతిబాపూలే వెనకబడినతరగతుల బాలికల గురుకులంలో చొరబడి దౌర్జన్యం చేసిన ఆ బిల్డింగ్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు బాబురావు హసన్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంజేపీటీబీసీడబ్ల్యుఆర్ బాలికల గురుకుల పాఠశాలను డిసెంబర్ 2019 నుంచి సెయింట్ జాన్స్ ఫార్మసీ కళాశాలలో అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాంపస్లో మౌళిక వసతులకై ముందుగా రూ.5 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. బాలికలకు మౌళిక వసతులు కల్పించకపోవడంతో నెలకు రూ.4.76 లక్షల కిరాయి తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. పాఠశాల నిర్వహణ కొనసాగకపోయినప్పటికి 9నెలల కిరాయి చెల్లించినట్లు తెలిపారు. తరువాత ఒకేసారి రెండు నెలల కిరాయి మార్చిలో చెల్లించినప్పటికీ బాలికలకు మౌళిక వసతుల కల్పనలో లిఖితపూర్వకంగా వ్రాయించిన ఇచ్చిన హామీ పనులు కూడా చేయడం లేదని పేర్కొన్నారు.
లాక్డౌన్ తరువాత పాఠశాల ప్రారంభం కావడంతో, హామీ ఇచ్చిన పనులు ప్రారంభిస్తే మంజూరైన కిరాయి డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికి గురువారం అతిగా మద్యం సేవించి బాలికలు, వారి తల్లిదండ్రుల ముందు నానాబూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడినట్లు ప్రిన్సిపాల్ బాబురావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇందుకు సంబందించిన సీసీ పుటేజీలు కూడా పోలీసులకు అందించినట్లు పేర్కొన్నాడు. అతిగా మద్యం సేవించి బాలికల గురుకుల పాఠశాలకు వచ్చి దౌర్జన్యం చేసి నానాబూతులు తిడుతూ విద్యార్థినీలను భయోత్పాతానికి గురిచేసిన గురుకుల విద్యాలయం భవన యజమాని కొండల్రెడ్డిపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ప్రధానోపాధ్యాయులు బాబురావు పోలీసులను కోరారు.