Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న కౌంటింగ్
- అర్థరాత్రి తెలియనున్న విజేతల వివరాలు..
నవతెలంగాణ-మట్టెవాడ
ఉత్కంఠభరితంగా నువ్వా నేనా అనే రీతిలో హౌరాహౌరీగా సాగిన ఐఎంఏ వరంగల్ శాఖ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలోని సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, సహాయ రిటర్నింగ్ అధికారి డాక్టర్ బందెల మోహన్ రావు పర్యవేక్షణలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు మందకొడిగా సాగినప్పటికీ, మధ్యాహ్నానికి పుంజుకొని పోలింగ్ ముగిసే సమయానికి 65శాతంగా నమోదు అయ్యింది. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి దంపతులు, వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ కే వెంకటరమణ, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వీ చంద్రశేఖర్ తదితరులున్నారు.
పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సంయుక్త కార్యదర్శుల ఓట్ల లెక్కింపులు కొనసాగుతున్నట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు. గురువారం మధ్య రాత్రి విజేతల వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఐఎంఏ అధ్యక్ష పదవి కోసం డాక్టర్ వద్దిరాజు రాకేష్, డాక్టర్ బైరం బాలాజీ , ప్రధాన కార్యదర్శి పదవి కోసం డాక్టర్ నాగార్జున రెడ్డి , పీ ఎస్ ఎస్ మల్లికార్జున్, కోశాధికారి పదవి కోసం డాక్టర్ బింగి శ్రీనివాస్, డాక్టర్ సంపత్ కుమార్, సంయుక్త కార్యదర్శి పదవి కోసం డాక్టర్ కంచర్ల ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ హనుమంతరావులు బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తూ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు.