Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జీ నాగయ్య
నవతెలంగాణ-దుగ్గొండి
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్నాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జీ నాగయ్య తెలిపారు. గురువారం మండల ద్వితీయ మహాసభను గిర్నిబావిలో పుచ్చకాయల కృష్ణారెడ్డి, చిల్పూరి మొగిలి అధ్యక్షన నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన చట్టాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నట్టు దుయ్యబట్టారు.
రాష్ట్రంలో జరుగుతున్న హుజరాబాద్ ఎన్నికలలో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని వాపోయారు. దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా, కుటుంబ పాలనతో కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సహకారంతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు పుచ్చకాయల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, మండల కార్యదర్శి ఈసంపల్లి బాబు, జిల్లా కమిటీ సభ్యులు భూక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, హనుమకొండ శ్రీధర్, స్వామి, కడియాల వీరాచారి, మండల నాయకులు నరసింహారెడ్డి, నల్లగొండ మొగిలి, రమేష్, నరసింహస్వామి, సాంబయ్య, భాస్కర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.