Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంచి ఉన్న ప్రమాదాలు
- మండలంలో కల్లాల నిర్మాణాలు శూన్యం
నవతెలంగాణ-మల్హర్రావు
వరి ధాన్యం అరబెట్టుకునేందుకు రైతులకు కల్లాలు కరువై రోడ్లే దిక్కవుతున్నాయి. అయితే రోడ్లపై ధాన్యం అరబోస్తుండటంతో రోడ్లు ప్రమాధాలుగా మారి పలువురు తీవ్రంగా గాయపడుతున్న పరిస్థితి. గతేడాది కిందట మండలంలోని పెద్దతూండ్ల, తాడిచెర్ల ప్రధాన రహదారి, ఎడ్లపల్లి, రుద్రారం ప్రధాన రహదారిపై పలువురు తీవ్రంగా గాయపడిన సంఘటనలూ ఉన్నాయి. ప్రభుత్వం ఎండు కల్లాలు నిర్మించుకునేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో నిధులుస్తున్న బిల్లులు సకాలంలో చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు కల్లాలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపకపోవడం, ఇందుకు తోడు స్థలాల కొరత ఉండటంతో కల్లాల నిర్మాణాల్లో రైతులు ముందుకు రావడం లేదనే ఆరోపణలున్నాయి.ఎండు కల్లాల నిర్మాణాలపై సంబంధిత ఈజిఏస్ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పటికి ఒక్కటి కూడా పూర్తి కాలేదు.
కల్లాల నిర్మాణం శూన్యం
ఉపాధిహామీలో భాగంగా మండలంలో 139 కల్లాల నిర్మాణాలకు గాను రూ.కోటి60లక్షల92వేలు మంజూరయ్యాయి. గతేడాది క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభం కాగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా నిర్మా ణం పూర్తి కాలేదంటే ఉపాధి హామీ సిబ్బంది పనితీరు ఇట్టే అర్థమవుతోంది. కల్లాలు పురోగతిలో మాత్రం 42 ఉండగా వీటికి ఇప్పటికే రూ.9 లక్షల 92 వేల బిల్లులు చెల్లించారు. ఇంకా 97 కల్లాలకు అసలే పనులు ప్రారంభం కాలేదు. కల్లాలు 538 చదరపు అడుగుల నిర్మాణానికి రూ.58వేలు, 645 చదరపు అడుగుల నిర్మాణానికి రూ.68 వేలు, 807 చదరపు అడుగుల నిర్మాణానికి రూ.85 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. మార్కెట్ల రేట్ల ప్రకారం వీటి నిర్మాణానికి అధిక వ్యయం కావడంతో పాటు బిల్లులు సకాలంలో రాకపోవడం, స్తల సమస్యలతో ఎండు కల్లాల నిర్మాణాలపై ఆసక్తి చూపని పరిస్థితి.
రోడ్లపై ధాన్యంతో అనుకోని ప్రమాదాలు
ఈ ఏడాది వానాకాలం సీజన్ తో వరిదాన్యం దిగుబడులు అధికంగా వస్తున్నాయి. ధాన్యం అరబెట్టుకునేందుకు స్థలాలు లేక ప్రధాన రహదారులు, గ్రామీణ రోడ్లపై రైతులు పోస్తున్నారు. రాత్రి సమయంలో కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పి ఉంచుతున్నారు. పలుచోట్ల రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయంతోపాటు రోడ్లలో సగం స్థలాన్ని అక్రమించడం, ధాన్యంలోకి వాహనాలు రాకుండా చుట్టూ పెద్డ పెద్ద బండరాళ్లు పెట్టి ఉంచుతున్నారు. దీంతో ఒకవైపు రోడ్లలోనే వాహనాలు రాకపోకలు కష్టంగా మారాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో ధాన్యం కుప్పలను ఢకొీని తీవ్రంగా గాయపడుతున్నారు.