Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన'సాగుతున్న' ఓటుకు-నోటు
- కోవర్టులపౖౖౖె నిఘా..
- ఓటర్లకు నేరుగా రూ.150 కోట్ల నగదు పంపిణీ ?
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ఉండడంతో టీఆర్ఎస్, బీజేపీలు వ్యూహం, ప్రతివ్యూహాలతో పావులు కదుపు తున్నాయి. ఇరు పార్టీల నాయకత్వం నగదు పంపిణీలో తలమునుకలై ఉన్నాయి. కోవర్టులపై గట్టి నిఘా పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ఓటుకు రూ.6 వేలు పంపిణీ చేయగా, బీజేపీ పలు ప్రాంతాల్లో ఓటుకు రూ.15 వందలు పంపిణీ చేసింది. పలు గ్రామాల్లో నగదు ఇవ్వకపోవడంపై పలువురు ఓటర్లు రోడ్డుపైకి వచ్చి టీఆర్ఎస్ నాయకత్వంపై నిరసన తెలపడంతో టీఆర్ఎస్లో గుబులు నెలకొంది. ఏదేమైనా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో, ఏ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.6వేలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఈ లెక్కన టీఆర్ఎస్, బీజేపీ నేరుగా ఓటర్లకు నగదు పంపిణీ ద్వారా సుమారు రూ.150 కోట్లను ఖర్చు చేస్తున్నాయని అంచనా. టీఆర్ఎస్, బీజేపీల నాయకత్వం కోవర్టుల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కాగా అధికార యంత్రాంగం నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లలో తలమునుకలైంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఓటుకు రూ.6వేలు పంపిణీ, అందని వారు స్థానిక నేతల్ని నిలదీసిన వ్యవహారం టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. అత్యంత పకడ్బందీగా నగదు పంపిణీ చేపట్టినా బహిరం గంగా నగదు పంపిణీపై ఓటర్లు నిలదీయడంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు తలపట్టుకుంటున్న పరిస్థితి. ఇదిలావుంటే టీఆర్ఎస్, బీజేపీ నేతలు గురువారం సైతం నగదు పంపిణీని యధేచ్ఛగా కొనసాగిస్తున్నా ఎన్నికల సంఘం అడ్డుకోవడంలో విఫలమైన పరిస్థితి. శుక్రవారం కూడా ఈ పంపిణీ కొనసాగే అవకాశం లేకపోలేదు, స్థానిక ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వున్న వారికి ప్రయాణఖర్చులతోపాటు ప్రత్యేక ప్యాకేజీని అధికార టీఆర్ఎస్ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో దూర ప్రాంతాల్లో వున్న వారిని కూడా ఓట్ల కోసం పార్టీ నేతలు రప్పిస్తున్నారు.
రూ.150 కోట్ల నగదు పంపిణీ ?
హుజురాబాద్ నియోజకవర్గంలో 2.36 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీిఆర్ఎస్, బీజేపీ నేతలు నేరుగా ఓటర్లకు సుమారు రూ.150 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు అనధికారిక సమాచారం. ఓటర్లు నేరుగా చెబుతున్న సమాచారాన్ని బట్టి అధికార టిఆర్ఎస్ ఓటరుకు రూ.6వేలు, బీజేపీ రూ.1,500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. అధికార టిఆర్ఎస్ నియోజకవర్గంలోని 2.36 లక్షల ఓటర్లలో సుమారు 2 లక్షల మంది ఓటర్లకు నగదును పంపిణీ చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీనే ఏకంగా ఓటర్లకు రూ.120 కోట్లను పంపిణీ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. బీజేపీ రూ.1,500 చొప్పున పంచితే మొత్తంగా రూ.30 కోట్లు పంపిణీ చేసినట్టే లెక్క. కానీ, 2 లక్షల మంది ఓటర్లకు నగదును పంపిణీ చేసే అవకాశం లేదని సమాచారం. ఇదంతా గత మూడు, నాలుగు నెలలకు అయిన ఖర్చులకు అదనంగా జరుగుతున్న ఖర్చు కావడం గమనార్హం.
ఇన్ఛార్జిలు, నేతల దినసరి ఖర్చులు..
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం షెడ్యూల్ వచ్చిన దాని కంటే ముందు నుండే జరుగుతుండడం గమనార్హం. నియోజకవర్గానికి వచ్చిన టిఆర్ఎస్, బిజెపి నేతలకు సంబంధించి ఉండడానికి మకాం, భోజనం, మద్యం, పైపెచ్చు దినసరి ఖర్చులు, గంపగుత్తగా పైకం ఇవన్నీ లెక్కలు తీస్తే హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చు వందల కోట్లలో వుంటుందన్నది వాస్తవం. అధికార టిఆర్ఎస్ నేతలు గత నెల రోజులుగా 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించారు. బిజెపి నేతలు 60 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేశారు. ఈ లెక్కలు భారీగా వున్నాయి. ఒక్కో ఇన్ఛార్జి ప్యాకేజీ లక్షల్లో వున్నట్లు సమాచారం.