Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'బండి' దీక్ష అర్ధరహితం
- మంత్రి ఎర్రబెల్లి, పల్లా
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కపట నాటకమని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు దీక్ష అర్ధరహితమని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభి వృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతు బంధు సమితి రాష్ట్ర ఛైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడారు. ధాన్యం కొనమని చెప్పింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. అయినా రైతుల శ్రేయోభిలాషి సీఎం కేసీఆర్ ధాన్యం కొంటామని చెబుతూనే వున్నారన్నారు. దమ్ముంటే బండి సంజరు ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ దీక్ష చేయాలన్నారు. తెలంగాణ, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ, గౌరవం ఉంటే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం నుండి ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. చేతకాకపోతే మీరు చవటలని ఒప్పుకొని మీ ఎంపి, కేంద్ర మంత్రి పదవులకు వెంటనే రాజీనామా చేయాలన్నారు. రైతుల విషయంలో కేంద్రానికి దొంగ నాటకమన్నారు. వానాకాలం మొదలవడానికి ముందు నుండే నాలుగు నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కోరినా కేంద్రం స్పందించలేదన్నారు.
హుజురాబాద్‌లో వార్ వన్‌సైడే..
హుజురాబాద్‌లో వార్ వన్సైడేనన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే బిజెపి నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి తల కిందకు పెట్టి, కాళ్లు పైకి పెట్టినా చేయగలిగిందేమి లేదన్నారు. మంచి పదవులు, అవకాశాలు ఇస్తే ఈటల రాజేందర్ తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ను బొంద పెడుతానన్నపుడే ఈటల రాజేందర్ వైఖరి బహిర్గతమైందన్నారు. గెల్లు శ్రీనిను హుజురాబాద్ ప్రజలు ఆశీర్వదించాలన్నారు. హుజురాబాద్ రైతాంగం బిజెపి బజారు రాజకీయాలు గమనించి తిప్పికొట్టాలన్నారు. బిజెపి ఎన్ని పిచ్చి చేష్టలు వేసినా హుజురాబాద్‌లో గెలిచేది టిఆర్ఎస్సేనన్నారు. ఈ వానాకాలం వరి పంటలో కేవలం 59 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మాత్రమే కేంద్రం అంగీకరిం చిందన్నారు. 1 కోటీ 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు. వానాకాలంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకు బిజెపి దొంగ దీక్షలు చేస్తుందన్నారు.