Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న ఎంజేపీటీబీసీడబ్య్లూఆర్ఎస్ విద్యార్థులు సౌకర్యాల కల్పనకు
- కృషిచేయాలని బిల్డింగ్ యజమానికి ఆదేశం
- పరిశీలించిన హన్మకొండ జిల్లా ఆర్సీఓ మనోహర్‌రెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలోని ఎల్లాపూర్ శివారు మహాత్మాజ్యోతిరావు పూలే వెనకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాల వర్దన్నపేట సమస్యల వలయంలో చిక్కుకుంది. సౌకర్యాలు లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నీటి వసతితో పాటు టాయిలెట్స్, బాత్రూంలు లేవని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అయితే వర్షపు నీరు గదులలో చేరి జాగారం చేయాల్సిన దుస్తితి నెలకొంది. కనీసం తరగతి గదులు, డార్మేట్రీలు అసౌకర్యంగా ఉన్నాయని, బాల్కనీలు రక్షణ లేకుండా ప్రమాదకరంగా ఉన్నాయని విద్యార్థినీలు భయాందోళనకు గురవుతున్నారు. స్నానపు గదులలోని నీరు ఇతర గదులలోకి చేరి దుర్గందం వస్తుందని విద్యార్థులు ఈసడించుకుంటున్నారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబురావు సంబందిత బిల్డింగ్ యజమాని దృష్టికి తీసుకురాగా.. గురువారం మద్యం మత్తులో వచ్చి పాఠశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీల ముందే అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా పరుషపదజాలంతో దూషించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబురావు పోలీసులకు, హన్మకొండ ఆర్సీఓ మనోహర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సంబందిత బిల్డింగ్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు ఆదేశాల మేరకు ఎస్సై సాంబయ్య శుక్రవారం బాలికల పాఠశాలలో విచారణ చేపట్టి నివేధికను ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావుకు అందజేశారు.
బిల్డింగ్ యజమాని పనితీరుపై ఆర్సీఓ మండిపాటు
బాలికలకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డింగ్ యజమాని కొండల్రెడ్డిపై హన్మకొండ ఆర్సీఓ మనోహర్‌రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. శుక్రవారం ఎల్లాపూర్లోని ఎంజేపీటీఎస్బీసీడబ్ల్యుఆర్ఎస్ బాలికల పాఠశాలను సందర్శించి బిల్డింగ్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం జరిగిన విషయంపై సంబందిత ఎస్సై సాంబయ్యతో కలిసి విచారణ జరిపారు. సౌకర్యాలు కల్పించని యజమానిపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబురావును నోటీసులు జారీ చేయాలని సూచించారు. విద్యార్థినీల సమస్యలను అడిగి తెలుసుకొని సత్వర పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సత్వరమే బాల్కనీకి రక్షణగా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా తరగతి గదులు ఉండేలా చూడాలని, విద్యార్థినీలకు సరిపడ నీటి నిల్వ కోసం ట్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలో ప్రమాదకరంగా నిల్వ చేసిన ల్యాబ్ కెమికల్స్‌ను ఖాళీ చేయాలని, టాయిలెట్స్, డైనింగ్, డార్మెటరీలో సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి తరగతి గదిలో లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసేలా బిల్డింగ్ యజమానికి నోటీసులు జారీ చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబురావును ఆదేశించారు.
బిల్డింగ్ యజమానిపై కేసు నమోదు..
ఎంజేపీటీఎస్బీసీడబ్ల్యుఆర్ఎస్ బాలికల గురుకుల పాఠశాలలో మద్యం మత్తులో వీరంగం చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పరుషపదజాలంతో దూషించడంతో పాటు భయబ్రాంతులకు గురిచేసిన బిల్డింగ్ యజమాని కొండల్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు వెల్లడించారు.