Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
రైతులు పండించుకునే పంటలపై ఆంక్షలెందుకని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెపు ఉపేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణలు అన్నారు. భూమికి సరిపడే పంటను సాగు చేసుకునే హక్కు రైతులకే ఉంటుందని, ఆంక్షలు విధించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని వారు చెప్పారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో 'పంటల సాగు-ప్రభుత్వం ఆంక్షలు-రైతుల కర్తవ్యం' అనే అంశంపై రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక ఓంకార్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వం వరి వేయరాదని ఇంత వరకు అధికారికంగా ఆదేశాలు జారీ చేయలేదన్నారు.
గత యాసంగి, ఈ వానాకాలం కొనుగోలు చేయనన్న ప్రభుత్వం 6,300 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. గత యాసంగిలో 92 లక్షల టన్నుల వడ్లు కొన్నారని, ఈ వానాకాలం కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం విధానం ప్రకటించకున్నా, ఏలాంటి జీఓలు రాకున్నా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రభుత్వం యాసంగి వడ్లు కొనదని ప్రకటించారని, మరో మంత్రి ప్రభుత్వం వరి పంటపై ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారని తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్నవారు పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తూ రైతులను గందరగోళ పరుస్తున్నారన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ మరోరకం బియ్యం కొనుగోలు చేయవద్దని ఎఫ్˜సీఐ ద్వారా ఉత్తర్వులు ఇప్పించడం, అది బహిర్గతం కావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న దోబూచులాట నిదర్శనంగా మారిందన్నారు.
వరి పంటపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ నవంబర్ 1, 2 తేదీల్లో మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వ హించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ సీసీ జిల్లా కో-కన్వీనర్ రాచర్ల బాలరాజు, ఏఐసీటీయూ రాష్ట్ర నాయకుడు గోనె కుమారస్వామి, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఓదెల రాజన్న, ఏఐకెఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసా రెడ్డి, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.