Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో ఖరీఫ్‌లో 1,91207 ఎకరాల్లో వరి సాగు
- ప్రభుత్వ నిర్ణయంతో రబీకి రైతుల డైలమా
- విత్తనాలు, ఎరువుల కొనుగోలు ఊసే ఎత్తని వైనం
నవతెలంగాణ-బచ్చన్నపేట
వరి సాగు వద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మెడపై కత్తి పెడుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించి నేడు వరి సాగు వద్దంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏండ్ల తరబడి వరి సాగు చేస్తున్నామని పేర్కొంటున్నారు. గతేడాది నియంత్రిత సాగుచేస్తే కొనుగోలు చేయక నష్టపోయామని వాపోతున్నారు. ఇప్పటికే సాగుచేసిన పంటలకు గిట్టుబాటు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలున్నాయి. వారం పది రోజులు రబీ సాగుకు సన్నద్ధం కానున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఎరువులు పంటల కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రణాళిక ప్రకటించక పోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జనగామ జిల్లాలో ఖరీఫ్ సాగు కింద 1,91207 ఎకరాలు వరి సాగు చేశారు. ఇందులో 80 శాతం మంది రైతులు మళ్లీ రబీలో సాగు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం వరి వద్దనడంతో ఆందోళనయచెందుతున్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు వెచ్చించి వరి సాగుకు అనుకూలంగా భూముల్లో పైపులైన్లు బంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి భూములను వారి సాగు కె అనుకూలంగా మార్చుకున్న రైతులు పత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పడం గమనార్హం. జిల్లాలో మూడేండ్లకిందట 76320 ఎకరాలు వరి సాగైతే ప్రస్తుతం 1,91,207 ఎకరాల వరి సాగవుతోంది. బచ్చన్నపేట మండలంలో నాలుగు సంవత్సరాల క్రితం 7623 ఎకరాల సాగైతే ప్రస్తుతం 25వేల ఎకరాల పైచిలుకు సాగవుతున్నదని అధికారుల అంచనా. ప్రస్తుతం ప్రభుత్వాల తీరుతో రైతులు ఆందోళనలో పడ్డారు. పప్పు, నూనె గింజలు సాగు చేస్తే వాటికి విత్తనాలు, సాగు విధానం,పెట్టుబడి, గిట్టుబాటు తదితర వాటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు డైలమాలో పడుతున్నారు. వాటిని కనీసం నిల్వ చేసుకుందామని అనుకుంటే గోదాములు కూడా లేవని వాపోతున్నారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోతున్న పరిహారం అందడం లేదని పేర్కొంటున్నారు.
ఏండ్లుగా వరి సాగు చేస్తున్నాం : శివరాత్రి కిష్టయ్య
రిజర్వాయర్లను నిర్మించిన నాటి నుండి ఇక్కడి చెర్లకు నీరు పంపించడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరిగాయి. నాకున్న భూమి చెరువు కిందనే ఉన్నది. వరి తప్ప వేరే ఏ పంట వేయలేను. మొత్తం జాలువారి పోతుంది. ఇప్పుడు ప్రభుత్వం వరి వద్దు అంటే ఇబ్బందులు పడాల్సిందే.
కలెక్టర్లు, మంత్రులు కూడా చెప్పడం సరికాదు : గొల్లపల్లి బాపురెడ్డి, సీపీఐ(ఎం) మండల ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ అధికారులు అయిన కలెక్టర్లు, పాలన సాగించే మంత్రులే ఇట్లా రైతులను భయాందోళనలకు గురి చేయడం భావ్యం కాదు. ఇక్కడి భూములు వరి సాగుకు అనుకూలం. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.