Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలు
- తప్పని పరిస్థితిల్లో అద్దెకు
- మండలంలో 15 వేల ఎకరాల సాగు
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రభుత్వం సబ్సిడీపై అందించే టార్ఫాలిన్ కవర్ల సరఫరాను మూడేండ్లుగా నిలిపి వేసింది. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు వపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. లేదంటే ఖాళీ ఎరువుల బస్తాలు సిమెంట్ సంచులతో కుట్టిన వాటిని ప్రైవేటులో అద్దెకు తీసుకుని ధాన్యం తడవకుండా చూస్తున్నారు.
గతేడాది మండలంలో కురిసిన వర్షాలకు చాలామంది రైతుల ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయారు. మండ లంలో ఈ ఏడాది సుమారు 23,733 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా అందులో వరి పంట 15,418 ఎకరాల్లో అధికంగా ఉంది. టార్పాలిన్లు లేక కిందనే అరబోసు కోవడంతో అకాల వర్షాలు కురిస్తే చేతికి వచ్చిన పంట తడిసి పూర్తిగా నష్టపో తున్నామని మండలంలోని అన్ని గ్రామాల రైతులు వాపోతున్నారు. సబ్సిడీ టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ప్రయివేటు లో కొనుగోలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నామని వాపోతు న్నారు.
రైతన్నకు ఆర్థిక భారం
గతంలో వ్యవసాయ ఉద్యాన శాఖ సమన్వయంతో రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లు పంపిణీ చేసేవారు. 250 జిఎస్ ఎం, 8 మీటర్ల విస్తీర్ణం ఉన్న టార్పాలిన్ రూ.2500 కాగా 50శాతం రాయితీపై రూ.1250 కి అందజేసే వారు. 2017-18 వరకు ఈ పథకం అమలు చేశారు. అనంతరం నిలిపి వేయడంతో రైతులు ప్రయివేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో టార్పాలిన్ రూ.2500 నుంచి రూ.8వేల వరకు ఉండటంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. సబ్సిడీ పథకాలను ఎత్తివేస్తూ రైతులను ఇబ్బందికి గురిచేయడం సరికాదని రైతు సంఘాల నాయకులు, రైతులు వాపోతున్నారు.
నష్టపోతున్నాం
ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు రాయితీపై అందించే సబ్సిడీ టార్ఫాలిన్ పథకాన్ని నిలిపివేయడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. ఖాళీ యూరియా సిమెంట్ సంచులతో కుట్టిన వాటిని రోజుకు రూ.40 నుంచి రూ.50 చొప్పున అద్దెకు తీసుకునే పరిస్థితి నెలకొంది. పథకాన్ని పునర్ప్రారంభిస్తే రైతులకు మేలు కలుగుతుంది.
- అక్కల బాపుయాదవ్, రైతు సంఘం నాయకుడు
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
టార్ఫాలిన్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. గత మూడేళ్ళ నుంచి టార్ఫాలిన్ల సరాఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. రైతుల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. బడ్జెట్లో నిధులు కేటాయిస్తే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
- ముంజ మహేష్‌యాదవ్, మండల వ్యవసాయ అధికారి