Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-మహాదేవపూర్
మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం లో 2022 ఏప్రిల్‌లో నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాల నిర్వహణకు నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం కాలేశ్వరంలోని ముక్తిశ్వరాలయ సమావేశ మందిరంలో జేసీ కూరాకుల స్వర్ణలతతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు సమీక్ష సమా వేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు.గతంలో నిర్వహించిన దాని కంటే ఈ సారి మరింత వైభవోపేతంగా దేశం దృష్టిని ఆకర్షించేలా ప్రాణహిత పుష్కరాలను నిర్వహించాలని అన్నారు. ఇందుకు ముందస్తుగా అధికారులు ఆయా శాఖ ద్వారా చేపట్టనున్న పనుల గురించి ఎస్టిమేట్ సిద్ధం చేసి సమర్పించాలన్నారు. పుష్కర కార్యక్రమాలను నిర్వహించే ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని అన్నారు. రూ.25 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనుల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రారంభించని పనుల్ని రద్దు చేసి మళ్లీ షార్ట్ టెండర్ పిలిచి పనులను నిర్వహించాలన్నారు. జాతర సమయంలో మహాదేవపూర్ నుండి కాళేశ్వరం వరకు రహదారిని మరమ్మతు చేయాలన్నారు. పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, ప్రధాన ఘాట్ రోడ్డు, విఐపి ఘాట్ రోడ్డును విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. శానిటేషన్, తాగునీరు, మరుగుదొడ్ల సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. షవర్స్ ఏర్పాటు చేయాలని, మహిళల సౌకర్యార్థం ప్రత్యేక గదులు నిర్మించాలన్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ సమస్య రాకుండా అదనంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా జాతరకు ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. మరో పది, పదిహేను రోజుల్లో ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని ఈలోగా శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఎంపీపీ రాణి భాయి, జెడ్పీటీసీ గుడాల అరుణ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిం చుకునే ఈ పుష్కరాలలో సందర్శకులు ఎలాంటి ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ముక్తీశ్వర ఆలయానికి చేరుకోగా ఆలయ పూజారులు స్వాగతం పలికారు. ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్‌ను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. డీపీఆర్ఓ రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్, ఈవో మారుతి, సీఐ కిరణ్, కాళేశ్వరం ఎస్సై సాయి ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిద్దాం : ఎంపీపీ
నవతెలంగాణ-మహాదేవపూర్
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద వచ్చే ఏప్రిల్ లో నిర్వహించే ప్రాణహిత పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిద్దామని ఎంపీపీ బి రాణిబారు రామారావు అన్నారు. శుక్రవారం కాళేశ్వరం లో కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. కాళేశ్వరం పుష్కరాలకు లక్షలాదిమంది సందర్శకులు వస్తారని, వారికి సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం దేవస్థానానికి పాలక మండలి లేనందున ఆలయ ఈఓ, స్థానిక ప్రజా ప్రతినిధులు జెడ్పీ చైర్మన్ లు పుట్ట మదన్న, జక్కు శ్రీహర్షిణి ఆధ్వర్యంలో మంత్రి దయాకర్ రావు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇండోమెంట్ కమిషనర్ లను కలిసి పుస్కారాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా కాళేశ్వరం అభివద్ధి కి సీ ఎం కేసీఆర్ ఇచ్చిన రూ.25 కోట్ల పనులు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తి కాలేదన్నారు. 2022 మార్చి వరకు పనులు పూర్తి చేసి పుష్కర సందర్శకులకు సౌకర్యాలు కల్పించాలన్నారు.