Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్‌లో హైడ్రామా..
పోలీసులతో బీజేపీ నేతల వాగ్వాదం
పిచ్చి మంత్రులకు సదువు లేదు..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్‌మీట్‌ను వరంగల్ పోలీసులు అడ్డుకున్నారు. శనివారం మధ్యాహ్నాం వరంగల్ స్టేషన్‌రోడ్డులోని గ్రాండ్ గాయత్రి హౌటల్లో 'ఈటల' ప్రెస్‌మీట్ ఏర్పాటునకు విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ ఏసీపీ గిరికుమార్ ఎన్నికల కోడ్ ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రెస్మీట్లు పెట్టొద్దని అడ్డుకున్నారు. హౌటల్‌లోకి రాకముందే 'ఈటల'ను అడ్డుకోవడంతో బీజేపీ నేతలు, మాజీ ఎంపీ వివేక్, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి 'ఈటల'ను లోపలకు తీసుకువెళ్లారు. అనంతరం బీజేపీ నేతలు ప్రెస్మీట్లో మాట్లాడుతుండగా.. ఏసీపీ గిరికుమార్ సెక్షన్ 126ప్రకారం స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం గడువు ముగిశాక ప్రెస్‌మీట్ పెట్టొద్దని అడ్డుకునే ప్రయత్నం చేయగా, బీజేపీ నేతలు మాజీ ఎంపీ వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఏసీపీతో వాగ్వాదానిఇక దిగారు.
హుజురాబాద్‌లో డబ్బు పంపిణీని అడ్డుకోలేదెందుకు ..?
హుజురాబాద్‌లో పట్టపగలు డబ్బులు పంచుతుంటే అడ్డుకోలేని పోలీసులు తమను ప్రెస్‌మీట్ పెట్టకుండా అడ్డుకోవడం దారుణమని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. హన్మకొండలో మంత్రి దయాకర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెడితే అడ్డుకోని మీరు, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఏసీపీని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో కవర్లలో ఓటుకు రూ.6 వేలు పెట్టి పంచుతుండడాన్ని మీడియా బయటపెట్టినా పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు. పోలీసు వ్యవస్థ వన్‌సైడ్‌గా వ్యవహరిస్తోందనానరు. ఒక్కరోజు రూ.120 కోట్లు పంచితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ను అణిచివేయడానికి టీఆర్ఎస్ డబ్బులను భారీగా పంచిందన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. టీిఆర్‌ఎస్ డబ్బులిచ్చినా 'ఈటల' పట్ల ప్రజలకు సానుభూతి వుందన్నారు.
పిచ్చి మంత్రులకు సదువు లేదు : గుజ్జుల
మంత్రులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వీళ్లు పిచ్చి మంత్రులని, సదువు లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం వరి పండించొద్దంటడు, హరీశ్‌రావు అలాంటిదేమి లేదు వరి సాగు చేసుకొవచ్చంటడు.. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆయనకు ఏం తెలుసో, ఏం తెలువదో అర్ధం కాని పరిస్థితి వుందన్నారు. కేంద్రం దొడ్డురకాలను కొనుగోలు చేయదని చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వం రా రైస్ కొనుగోలు చేస్తుందని, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయదని చెప్పారు. ఈ విషయం మంత్రి నిరంజన్‌రెడ్డి చూపించిన ఉత్తర్వుల్లో స్పష్టంగా వున్నా మంత్రికి విషయం తెలిసినట్టు లేదన్నారు. కేంద్రంతో బాయిల్డ్ రైస్‌తో కొనుగోలు చేయించి మిల్లర్లు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమీషన్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. హుజురాబాద్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అంబులెన్స్‌లలో డబ్బులు తీసుకుపోయి పంపిణీ చేసినా, ప్రజలు 'ఈటల'వైపే వున్నారన్నారు. మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలను రండ అంటూ సంబోధించడం టీిఆర్‌ఎస్ మంత్రులకే చెల్లిందన్నారు. పెద్ద పుడింగిలాగ మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఏం తెలుసని మాట్లాడుతున్నాడన్నారు. ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు అబద్దాల మంత్రి అని అభివర్ణించారు. అబద్ధాలను ప్రచారం చేసుడే తప్పా వీళ్లు చేసేదేమి లేదన్నారు. హుజురాబాద్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వాక్స్వాతంత్య్రం లేదా ? అని ప్రశ్నించారు. పోలీసులు చెబుతున్న సెక్షన్ 123 బీజేపీ నేతలకే వర్తిస్తుందా ? టీిఆర్‌ఎస్ నేతలకు వర్తించదా ? అని నిలదీశారు. చట్టాలు టీఆర్ఎస్ నేతలకు చుట్టాలుగా మారాయన్నారు. విలేకరుల సమావేశంలో కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, కుసుమ సతీష్ తదితరులు పాల్గొన్నారు.